Vijaya Dairy: సింహాచలం మాత్రమే కాదు.. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలోనూ లడ్డూల తయారీకి విజయ డెయిరీ సంస్థ నుంచి చాలా సంవత్సరాలుగా నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. కిలో నెయ్యికి ₹585 ధర చెల్లిస్తున్నారు.. ఇక ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల ఆలయంలో విజయ సంస్థకు బదులుగా ఏజెన్సీ ద్వారా వైష్ణవి అనే ప్రైవేట్ డెయిరీ తయారుచేసిన నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు.. కిలోకు ₹572 రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే కాస్త అటూ ఇటూ ధరతో విజయ కంపెనీ నెయ్యి లభిస్తున్నప్పటికీ.. దానిని తీసుకోవడం లేదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఆలయాల్లో ప్రసాదం తయారీకి కొనుగోలు చేస్తున్న నెయ్యిలో నాణ్యత లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయ లాంటి సంస్థలను పక్కనపెట్టి ప్రైవేట్ సంస్థల నుంచి రోజు టన్నుల కొద్ది నెయ్యి కొనుగోలు చేస్తున్నారు.. ఇటీవల ద్వారకాతిరుమల ఆలయాన్ని ఎమ్మెల్యే పరిశీలించగా.. అక్కడ బూజు పట్టిన గోధుమ రవ్వ.. నాణ్యతలేని చక్కెర.. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉన్న నెయ్యి కనిపించాయి. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలు ఆలయాలలో పరిస్థితిపై ఆరా తీయగా.. అక్కడ కూడా అలాంటి దుస్థితే ఉందని తెలుస్తోంది.
రాజీ పడుతున్నారా..
కొన్ని ఆలయాల అధికారులు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ప్రైవేట్ సంస్థల నుంచి ఆమ్యామ్యాలు స్వీకరించి నాణ్యతకు మంగళం పాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. గతంలో విజయ, కర్ణాటక నందిని, గుంటూరు సంగం, కర్నూలు సహకార సంఘం డెయిరీ నెయ్యి ఆలయాల్లో ప్రసాదాల తయారీకి వాడేవారు. అయితే గత ప్రభుత్వ హయాంలో తక్కువ ధర పేరుతో ప్రైవేట్ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉదాహరణకు విశాఖపట్నం సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రసాదం తయారీకి విజయ సంస్థ నెయ్యిని వాడేవారు. అయితే 2022 -23 సంవత్సరానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రీమియర్ యాగ్రాటెక్ ఫుడ్స్ అనే సంస్థ ₹393కే టెండర్ దక్కించుకొని నెయ్యి సరఫరా చేసింది.. 2023-24 సంవత్సరాలకు సంబంధించి సూర్యకుమారి ఏజెన్సీస్ అనే సంస్థ కిలో ₹529 సరఫరా చేసింది.. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఏలూరు జిల్లాకు చెందిన రైతు డెయిరీ కిలో ₹385 ధరకు నెయ్యి సరఫరా చేస్తోంది. ఈ ప్రకారం చూసుకుంటే విజయ సామస్తత పోల్చుకుంటే ప్రీమియర్ యాగ్రో టెక్, రైతు డెయిరీ సంస్థలు కిలోకి ₹200 కు తక్కువ ధరతో నెయ్యి సరఫరా చేస్తున్నాయి. ఇక ఇందులో నాణ్యత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు .
ఇంతటి వ్యత్యాసమా
సింహాచలం ఆలయానికి ₹385 ధరతో నెయ్యి అందజేస్తున్న రైతు డెయిరీ.. అన్నవరం ఆలయానికి 538 ధరతో నెయ్యి సరిపడా చేస్తోంది. రెండు దేవాలయాలకు ఒకే సంస్థ సరఫరా చేస్తున్న నెయ్యిలో రూ. ₹153 వ్యత్యాసం ఉండడం విశేషం.. అన్నవరం ఆలయానికి 2019 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు సంగం, విశాఖ, కృష్ణా, విజయ సంస్థలు ₹430 – ₹480 ధరతో నెయ్యి అందజేశాయి. 2020 రెండు అక్టోబర్ నుంచి రైతు డెయిరీ నెయ్యి సరఫరా విభాగంలోకి ప్రవేశించింది.. ప్రతి ఆరు నెలలకు ధర పెంచుకుంటూ పోయింది. ₹498, ₹564, ₹540, ₹538 ధరలతో అందించడం మొదలు పెట్టింది.. అయితే ప్రభుత్వ సంస్థలను పక్కనపెట్టి అన్నవరం ఆలయ అధికారులు రైతు డెయిరీ సంస్థ వైపు మొగ్గు చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..పైగా ప్రవేట్ సంస్థలు ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ను ఆలయాల అధికారులు ప్రామాణికంగా తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లోని అధికారులు ప్రైవేట్ సంస్థల నెయ్యికి జై కొడుతుండడం అనేక విమర్శలకు కారణమవుతోంది.