Janasena Viral Video : అదేదో సినిమాలో పంచాయతీ ఎన్నికల్లో తాను గెలిస్తే గ్రామానికి రింగ్ రోడ్డు కట్టిస్తానని ఓ అభ్యర్థి హామీ ఇస్తారు. సినిమాలో కామెడీ కోసం ఆ సీన్ పెట్టినా రీయల్ లైఫ్ కి దగ్గరగా ఉంటాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చే హామీలు కూడా అలానే ఉంటాయి. ఎన్నికల ప్రచారాలు కూడా మరీ కామెడీని తలపిస్తాయి. రైతులతో పాటు పొలం దున్నడం, లాండ్రీ షాపులో బట్టలు ఇస్త్రీ చేయడం, టిఫిన్ దుకాణాల్లో పూరీలు వేయడం, పకోడి తయారు చేయడం.. ఇలా ఒకటేమిటి ప్రచారంలో కొత్త పోకడలను అనుసరిస్తుంటారు. ఇక హామీలకు లెక్కుండదు. మొత్తం గ్రామం స్వరూపమే మార్చేస్తామంటూ తెగ హామీలిస్తుంటారు. ఎన్నికల తరువాత ఆ మాటనే మరిచిపోతారు.
అయితే తాజాగా ఓ ఎన్నికల హామీ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అది జనసేన నాయకుడు ఒకరు ఓ గ్రామంలో వినూత్న ప్రచారానికి దిగారు. జనసేనను గెలిపిస్తే ఇంటికి రెండు గేదెలు అందిస్తామని ప్రకటించారు. అయితే దానికి కూడా ఆయన షరతు పెట్టారు. గేదె రేటులో సగం సొమ్ము మీది.. సగం సొమ్ము మాది అని కండీషన్ పెట్టారు. పశువుల శాలకు ఇంటి వద్ద స్థలం లేకపోతే చెరువు గట్టుపై షెడ్డు మేమే కట్టిస్తాం అంటూ హామీ ఇచ్చారు. వాటి సంరక్షణకు ఒక మనిషిని ఏర్పాటుచేస్తామని కూడా చెప్పుకొచ్చారు. కేవలం మీరు పాలు పిండుకోవడమేనంటూ బదులిచ్చారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు వినూత్న రీతిలో స్పందిస్తున్నారు.
అయితే ఈ హామీ ఇచ్చిన నాయకుడు ఊరూ పేరూ లేదు. అది ఏ జిల్లా? ఏ నియోజకవర్గమో తెలియదు. కానీ జనసేన నాయకుడి పేరిట వైరల్ చేస్తున్నారు. అయితే ఇది మంచి పథకమే కదా అని ఎక్కువ మంది రియాక్టవుతున్నారు. జగన్ మాదిరిగా ఫిష్, మాంసం అమ్ముకోమని చెప్పలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఆర్థిక చేయూతనందించడం మంచిదే కదా అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే ఇంటికి రెండు గేదెల హామీ ప్రజల్లోకి బలంగా వెళుతోంది. కానీ ఎక్కడ అన్నది మాత్రం క్లారిటీ మిస్సవుతోంది.
జనసేన పార్టీని గెలిపిస్తే ప్రతి ఇంటికి రెండు గేదెలంట…ఇవేం హామీలురా బాబు… pic.twitter.com/nm91EYx6bU
— Radhika (Leo) (@sweety_00099) June 22, 2023