https://oktelugu.com/

Ramoji Rao : రామోజీ విచారణ కోసం ఏపీకి వస్తాడా? ఏం జరుగనుంది?

ఇందులో లాస్ట్ ఆప్షన్ కే రామోజీరావు మొగ్గుచూపే అవకాశం ఉంది. అటు శైలజా కిరణ్ సైతం మహిళ కావడంతో కొన్ని ప్రత్యేక పరిమితుల మధ్య ఇంటి వద్దే విచారణకు కోరే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. 

Written By:
  • Dharma
  • , Updated On : June 23, 2023 7:05 pm
    Follow us on

    Ramoji Rao : మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ పట్టుబిగిస్తోంది. విచారణ ముమ్మరంగా చేపడుతోంది. అందులో భాగంగా జూలై 5న విచారణకు హాజరుకావాలని మార్గదర్శి సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ లకు నోటీసులిచ్చింది. దీంతో ఇప్పుడది హాట్ టాపిక్ గా మారింది. ఆ రోజు గుంటూరు కార్యాలయంలో జరిగే విచారణకు వారిద్దరు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్గదర్శి చిట్స్ ఫైనాన్స్ సంస్థలో అవకతవకలపై దర్యాప్తు బాధ్యతలను ఏపీ సర్కారు సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు జరిపిన సీఐడీ అవకతవకలను గుర్తించింది. చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ లతో పాటు బ్రాంచ్ మేనేజర్లపై కేసులు నమోదుచేసింది.

    ఈ కేసులో ఎలాగైనా రామోజీరావును దోషిగా నిలబెట్టేందుకు జగన్ సర్కారు కంకణం కట్టుకుందన్న వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సీఐడీ దూకుడు మీద వ్యవహరిస్తోంది. ఇప్పటికే నేరుగా రామోజీరావుతో పాటు కోడలు శైలజా కిరణ్ ను విచారించింది. గత విచారణ సమయంలో రామోజీరావు స్ట్రెచర్ పై ఉంటూ సీఐడీ దర్యాప్తును ఎదుర్కొంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అటు శైలజా కిరణ్  నుంచి కూడా కీలక సమాచారాన్ని రాబెట్టారు. అయితే ఈ కేసులో ఇంత జరుగుతున్నా రామోజీరావు వెనక్కి తగ్గలేదు. అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వంతో పాటు సీఐడీ చర్యలనే ప్రశ్నిస్తూ వస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని మీడియాలో కథనాలు వండి వార్చుతూ వస్తున్నారు.

    అందుకే ఇప్పుడు సీఐడీ మరింత కఠినంగా ముందుకెళుతోంది. గుంటూరులో జూలై 5న విచారణకు హాజరుకావాలని వారిద్దరికీ నోటీసులు అందించారు. అయితే విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. వారి ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. విచారణకు హాజరుకావడం, లేకుంటే విచారణ వాయిదా వేయడానికి కోర్టును ఆశ్రయించడం, లేకుంటే వృద్ధాప్యం, అనారోగ్యం కారణం చూపి మొన్నటి మాదిరిగా ఇంటి వద్దే విచారణను కోరడం. అయితే ఇందులో లాస్ట్ ఆప్షన్ కే రామోజీరావు మొగ్గుచూపే అవకాశం ఉంది. అటు శైలజా కిరణ్ సైతం మహిళ కావడంతో కొన్ని ప్రత్యేక పరిమితుల మధ్య ఇంటి వద్దే విచారణకు కోరే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.