Botsa satyanarayana : జగన్ అనుకున్నది ఒక్కటి? జరిగింది మరొకటా? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ ఒక వ్యూహంతో అడుగులు వేస్తే.. చంద్రబాబు మరో వ్యూహంతో తిప్పి కొట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కూటమి అభ్యర్థిని పెట్టలేదు. దీంతో వైసిపి నేత బొత్స ఎమ్మెల్సీ ఎంపిక దాదాపు ఖాయమే. ప్రతిపక్షంలో ఉండగా వైసిపి ఏకగ్రీవంగా ఈ ఎమ్మెల్సీని దక్కించుకుంది. రెండు నెలల కిందటి అంతులేని మెజారిటీతో గెలిచిన కూటమి పోటీలో పెట్టేందుకు సాహసించలేకపోయింది. స్పష్టమైన బలం ఉన్నట్లు వైసీపీ చెబుతోంది. కానీ ఎన్నికలకు ముందు, తరువాత వైసీపీని చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు వీడారు. టిడిపి కూటమి పార్టీల్లో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దాదాపు వైసీపీ బలం సగానికి పడిపోయింది. టిడిపి కూటమికి మెజారిటీ మార్కు దాటే అవకాశం ఉంది. అయినా సరే అభ్యర్థిని దించేందుకు చంద్రబాబు వెనక్కి తగ్గాలంటే ఏదో ఒక వ్యూహం ఉందన్నది విశ్లేషకులు అభిప్రాయం. ఎన్నికల ఫలితాల అనంతరం బొత్స సైలెంట్ అయ్యారు. ఆయన టిడిపిలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. అందుకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో చర్చలు కూడా జరిగినట్లు టాక్ నడిచింది. అయితే దానికి నేరుగా బొత్స ఖండన ఇవ్వలేదు. ఎన్నికల రాజకీయాల్లో లేకపోవడంతో ఎవ్వరు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక రావడంతో బొత్స తెరపైకి వచ్చారు. ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేస్తూ జగన్ ప్రకటన చేశారు. కనీసం విశాఖ జిల్లా నేతలను సంప్రదించకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బొత్స సైతం అయిష్టంగానే ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.
* పట్టున్న నేత
వైసీపీలో ఉన్న సీనియర్ నేతలలో బొత్స పట్టున్న నేత. విజయనగరం తో పాటు ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపగలరు. ఆయన కోసం కాంగ్రెస్ తో పాటు బిజెపి ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పదు. అందుకే బొత్స ను వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టాలని జగన్ భావించినట్లు సమాచారం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. కూటమి దూకుడు మీద ఉన్న దృష్ట్యా తప్పకుండా అభ్యర్థిని పెడుతుందని.. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని.. ఎలాగైనా గెలవాలని చూస్తుందని జగన్ అంచనా వేశారు. పార్టీకి ఓటమి ఎదురైనా పోరాడం అన్న సంతృప్తి.. బలం లేకున్నా టిడిపి అభ్యర్థిని నిలబెట్టిందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ భావించారు.
* చంద్రబాబు స్కెచ్
అయితే జగన్ ఒకటి తలిస్తే.. చంద్రబాబు మరోలా వ్యూహం వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. మండలి లో శాసనసభ పక్ష నేతగా లేళ్ళ అప్పిరెడ్డి ఉన్నారు. బొత్స శాసనమండలిలో అడుగుపెడితే ఆ పదవి ఇవ్వడం ఖాయం. అదే జరిగితే వైసీపీలో బొత్స పట్టు కచ్చితంగా పెరుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ తో పాటు బిజెపి బొత్సను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు వైసీపీని చీల్చడానికి అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే బొత్స శాసనమండలిలో ప్రవేశానికి చంద్రబాబు స్కెచ్ వేసినట్లు విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
* రాష్ట్రస్థాయి నేత కావడంతో
బొత్స సత్యనారాయణ జగన్ కంటే సీనియర్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రిగా ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. రాష్ట్రస్థాయిలోప్రభావం చూపాలన్నది బొత్స అభిమతం. కానీ గత ఐదేళ్లుగా పేరుకే మంత్రి కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పైగా కాంగ్రెస్ భావజాలం ఉన్న నేత. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన పూర్వాశ్రమం నేతలు.. తిరిగి పార్టీ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో బొత్సను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో బొత్సకు ఎమ్మెల్సీగా అప్ గ్రేడ్ చేయించారు చంద్రబాబు. తాను ఎమ్మెల్సీ కావడానికి సహకరించిన చంద్రబాబు టాస్కును బొత్స ఎలాగైనా పూర్తి చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More