Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎన్డీఏ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్. ప్రధానంగా తెలుగు ప్రజలు అధికంగా నివాసం ఉండే బల్లార్పూర్ లో జరిగిన సభలో ఉత్సాహంగా మాట్లాడారు. బల్లార్పూర్ ఒక మినీ భారతదేశంగా అభివర్ణించారు. ఇక్కడ అన్ని భాషలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని చెప్పారు. సనాతన ధర్మం అన్ని మతాలను సమానంగా చూస్తుందని చెప్పారు. అలాంటి సనాతన ధర్మం మీద దాడి జరిగితే ఖచ్చితంగా పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చత్రపతి శివాజీ స్ఫూర్తి ఉందని చెప్పారు పవన్. ఏపీలో వైసీపీని ఓడించలేరంటే జనసేన ఓడించి చూపించిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలోనూ ఎన్డీఏ కూటమిని గెలిపించి చూపించాలన్నారు. తాను తెలుగుతోపాటు మరాఠీ కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఇంట్లో తన పిల్లలతో మరాఠీలతో మాట్లాడతానని గుర్తు చేసుకున్నారు. విదేశీ భాషలు నేర్చుకునే మనం సరిహద్దు రాష్ట్రాల భాషలు కూడా నేర్చుకోవాలన్నారు. ఐదు ప్రాంతీయ భాషల పై పట్టు పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
* బిజెపి పెద్దల కోరిక మేరకు
ఎన్డీఏలో ఇప్పుడు పవన్ కీలక భాగస్వామి. ఏపీలో ఓటమి గెలుపు వెనుక పవన్ ఉన్నారు. సంపూర్ణ విజయం సాధించారు. జాతీయ స్థాయిలో సైతం పవన్ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. అందుకే పవన్ తో ప్రచారం చేయించాలని బిజెపి భావించింది. ప్రధానంగా తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రచారం సాగింది. అక్కడ ప్రజలు కూడా ఎంతగానో పవన్ ఆదరించారు. ప్రత్యేకంగా ఆహ్వానించారు. మొత్తానికి అయితే పవన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
* చంద్రబాబు పర్యటన రద్దుతో
మహారాష్ట్ర తెలంగాణకు సరిహద్దు. ఎక్కువగా తెలుగు ప్రజలే ఉంటారు. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్దేశించగలరు. అందుకే బిజెపి అగ్ర నేతలు పవన్ తో పాటు చంద్రబాబును రంగంలోకి దించాలని భావించారు. మొన్న ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు అటు నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తారని షెడ్యూల్ ఖరారు చేశారు. కానీ ఇంతలోనే ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. దీంతో ఢిల్లీ నుంచి మహారాష్ట్ర రావాల్సిన చంద్రబాబు నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి సొంత గ్రామం నారావారిపల్లి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే పవన్ ఒక్కరే ప్రచారానికి దిగారు. కానీ విశేష ప్రభావితం చేశారని అక్కడి ఎన్డీఏ నాయకులు భావిస్తున్నారు. తప్పకుండా పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.