Rations : ఏపీ ప్రభుత్వం ( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి దుకాణాల ద్వారా అందించేందుకు నిర్ణయించింది. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే పంపిణీ జరుగుతుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వృద్ధులతో పాటు దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలివరీ జరుగుతుందని స్పష్టం చేశారు. జూన్ నుంచి రేషన్ వ్యాన్లు ఉండవని తేల్చి చెప్పారు. కేవలం వాటి నిర్వహణ భారంగా మారినందువల్లే ఎం డి యూ వాహనాలు తప్పించినట్లు తెలుస్తోంది. ఇంటింటికి రేషన్ పంపిణీకి గాను వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎం డి యు వాహనాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఇంటింటికి ఈ వ్యాన్ ద్వారానే రేషన్ సరఫరా జరిగింది. అయితే దీంతో నిర్వహణ భారంగా మారడంతో రేషన్ షాపుల ద్వారానే నేరుగా రేషన్ అందించేందుకు కోటని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. పాత విధానంలోనే రేషన్ అందించేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
* వాహనాల ద్వారా ఇంటింటికీ సరఫరా
2019లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ జరిగింది. తరువాత దీనికోసం ప్రత్యేకంగా ఎండియు వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే రాయితీపై ఈ వాహనాలను అందించింది. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించింది. నెలకు 21 వేల రూపాయలు సంబంధిత వాహనానికి అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి ఇంటికి వెళ్లి ఈ వాహనం రేషన్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ వీధి చివర్లో వాహనం ఆపి రేషన్ అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఈ వాహనాల నిర్వహణ పౌరసరఫరాల శాఖకు అదనపు భారంగా మారింది. అందుకే కూటమి ప్రభుత్వం ఈ వాహనాలను తప్పించినట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* టిడిపి ఆవిర్భావం తర్వాత మార్పులు..
గతం మాదిరిగానే జూన్ నెలకు సంబంధించి రేషన్ డీలర్ల ( ration dealers )వద్ద తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పౌరసరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. చౌక ధరల దుకాణం ద్వారా బియ్యంతో పాటు నిత్యవసరాలను అందిస్తూ వచ్చింది. అయితే క్రమేపి ఇది భారంగా మారడంతో నిత్యవసరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రేషన్ సరఫరా లో భాగంగా కేవలం బియ్యంతో పాటు పంచదారను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలను సరళీకృతం చేయాలన్న భావంతో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎండియు వాహనాలను ఏర్పాటు చేసింది. అయితే రేషన్ సరఫరా సులభతరం అయినా.. పౌరసరఫరాల శాఖ పై మాత్రం అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఈ వాహనాల భారం తప్పించాలని భావించింది. ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది.
* నిర్ణయం పై మిశ్రమ స్పందన..
జూన్ నెలకు సంబంధించి రేషన్ పాత విధానంలో డీలర్ వద్దే లబ్ధిదారులు తీసుకోవాల్సి ఉంది. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం జరిగింది. అదే విషయాన్ని వెల్లడించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్( Manohar ). ఇకనుంచి వాహనాలు రావని.. లబ్ధిదారులు నేరుగా డీలర్ల వద్దకు వెళ్లి రేషన్ తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ నిర్ణయం పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గతంలో డీలర్ వద్దకు వెళ్లకుండా ఇంటి వద్దకు తెచ్చి రేషన్ అందించేవారు. ఇకనుంచి ప్రతి ఒక్కరూ డీలర్ వద్దకు వెళ్లాల్సిందే. అయితే గతంలో ఎండియు వాహనం వచ్చినప్పుడే రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం నిర్దేశించిన రోజుల్లో డీలర్ వద్ద తీసుకోవాల్సి ఉంటుంది.