YS Jagan Mohan Reddy
Y S Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో( Andhra Pradesh) ప్రతీకార రాజకీయాలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టిడిపి నేతలను వెంటాడి వేధించారు. చివరకు మాజీ సీఎం చంద్రబాబును సైతం జైల్లో పెట్టగలిగారు. అసలు ఆధారాలు లేని కేసులను పట్టుకొని 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. మాటలతో దాడి చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఉన్నారు. వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారులు కటకటాల పాలయ్యారు. చివరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నెక్స్ట్ అరెస్ట్ ఆయనదేనని టాక్ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ధైర్యం కూడా తీసుకుని ప్రకటనలు చేస్తున్నారు. పార్టీని రక్షించుకోవడంతోపాటు పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతీకార రాజకీయాలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.
Also Read : మోడీ–జగన్ సంబంధానికి బీటలు.. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సరికొత్త చర్చ
* ఓటమి నుంచి గుణపాఠం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురయింది. దాని నుంచి బయటపడేందుకు ఆ పార్టీకి ఏడాదికాలం పట్టింది. అయితే వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరోవైపు పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి నేతలు సైతం తమ గారి తాము చూసుకున్నారు. ఆ పార్టీకి కష్టం అన్న రోజుల్లో పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఓటమిని తట్టుకొని ఆయన నిలబడ్డారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే జగన్లో కనిపిస్తున్న ధీమా పార్టీ శ్రేణుల్లో మాత్రం కనిపించడం లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం కూటమి ప్రభుత్వంపై కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి.
* బెంగళూరు వేదికగా మంతనాలు..
కూటమి ప్రభుత్వం( allians government ) దూకుడు మీద ఉంది. రకరకాల కేసుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేస్తోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ కీలక నేతలు, అధికారులు పెద్ద ఎత్తున అరెస్టు అవుతున్నారు. ఇక తదుపరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి న్యాయ నిపుణులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశాలు అవుతున్నారు. ఈ క్రమంలో వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కొడతానంటే కొట్టమనండి.. మీరు ఏ పుస్తకంలోనైనా సరే వారి పేర్లు రాసుకోండి.. ఆ అన్యాయం చేసిన వారిని సినిమా చూపిస్తాం. రిటైర్ అయిన లాక్కొస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్లిన తిరిగి రప్పిస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ..
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలను( local bodies) చేజిక్కించుకునేందుకు టిడిపి కూటమి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఈరోజు గ్రేటర్ విశాఖ కార్పొరేషన్, పార్వతీపురం, రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు . తాజా రాజకీయ పరిణామాలపై వారితో చర్చించారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను అక్రమంగా చేజిక్కించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుందని.. కానీ ఆ పార్టీ కౌన్సిలర్లను మనం లాగేద్దామని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అడిగితే.. తాను ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసి టిడిపి గెలిచే వాతావరణం కల్పించినట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి.
* డిఫెన్స్ లో వైసీపీ అధినేత..
అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కామెంట్స్ చూస్తే ఆయన పూర్తి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీలో ధైర్యం కల్పించకపోతే నేతలు పెద్ద ఎత్తున బయటకు వెళ్తారని ఆయన.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం శ్రేణుల్లో లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ధైర్య వచనాలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి బయటపడి పార్టీని విజయపథంలోకి తెప్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Y s jagan mohan reddy jagan revenge on alliance