Homeఆంధ్రప్రదేశ్‌Srungavarapu kota: భర్త వైసీపీలో ఎమ్మెల్సీ.. భార్య మాత్రం టిడిపిలోకి

Srungavarapu kota: భర్త వైసీపీలో ఎమ్మెల్సీ.. భార్య మాత్రం టిడిపిలోకి

Srungavarapu kota: ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీని పెద్ద ఎత్తున నేతలు వీడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అయితే ఓ ఎమ్మెల్సీ వైసీపీలో ఉండగా.. భార్య మాత్రం టిడిపిలో చేరారు . ఇదో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైస్ ఎంపీపీ ఇందుకూరు సుధారాణి లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఆమె వెంట 150 మంది వైసీపీ కీలక నేతలు టిడిపిలో చేరడం విశేషం. విజయనగరం నుంచి ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు వెళ్ళిన వీరంతా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఓ మహిళ నేత వెంట ఈ స్థాయిలో నేతలు వెళ్లడం ఏమిటన్న ఆసక్తికర చర్చ నడిచింది. అంతే ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.

ఇందుకూరి సుధారాణి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు భార్య. వీరిది విజయనగరం జిల్లాలోని శ్రుంగవరపుకోట నియోజకవర్గం. రఘురాజు బొత్స సత్యనారాయణ అనుచరుడు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరారు. శృంగవరపుకోట టికెట్ను ఆశించారు. కానీ అనూహ్యంగా ఆ సీటును కడుబండి శ్రీనివాసరావుకు జగన్ కేటాయించారు. అయినా సరే ఇందుకూరి రఘురాజు గట్టిగానే పని చేశారు. కడుబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురాజుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కావాలని రఘురాజు కోరుతూ వచ్చారు. కానీ హై కమాండ్ పట్టించుకోలేదు. అందుకే రఘురాజు తన భార్యను టిడిపిలోకి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.

గత కొంతకాలంగా ఎస్. కోట వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనిపై రఘురాజు ఎప్పటికప్పుడు హై కమాండ్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఎన్నికల్లో కూడా తిరిగి కడుబండి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో విసిగి వేశారిపోయిన రఘురాజు ముందుగా తన భార్యను టిడిపిలోకి పంపించినట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్సీల విషయంలో… వైసిపి హై కమాండ్ సీరియస్ గా ఉంది. అనర్హత వేటు వేయాలని నిర్ణయించుకుంది. అందుకే రఘురాజు మానసికంగా టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ భౌతికంగా మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు. తద్వారా వైసిపి నాయకత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్.కోటలో వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు ఉన్న నేతల్లో రఘురాజు ఒకరు. ఇప్పుడు ఆయన కుటుంబమే టీడీపీలో చేరింది. అటు రఘు రాజు సైతం అంతర్గతంగా టిడిపికి సహకరించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే రాజకీయాల కోసం భార్య ఒక చోట.. భర్త మరోచోట ఉండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో ఒక తరహా ప్రచారం జరుగుతోంది. అయితే భర్త సమ్మతం మేరకే ఆమె టిడిపిలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో అసలు విషయం తెలుసుకుని నెటిజన్లు సైతం షాక్ కు గురవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version