HomeతెలంగాణKCR: కేసీఆర్ సార్.. మరి కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయినట్టు?

KCR: కేసీఆర్ సార్.. మరి కామారెడ్డిలో ఎందుకు ఓడిపోయినట్టు?

KCR: రాజకీయ నాయకుడికి ఆత్మ విమర్శ ఉండాలి. గెలిచినప్పుడు విర్రవీగకూడదు.. ఓడిపోయినప్పుడు నిందలు వేయకూడదు. అలా వ్యవహరించినప్పుడే రాజకీయ నాయకుడు 10 కాలాలపాటు ప్రజా నాయకుడిగా వెలుగొందగలడు. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే.. నాయకుడి భవితవ్యం కూడా భిన్నంగానే ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బలమైన ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి బలమైన ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి ఉండడం, కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో బలాన్ని కలిగి ఉండటంతో రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనుకునే స్థాయిలో సవాళ్లు విసురుకుంటున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.. అయితే ఇందులో ఒకింత ఆసక్తిగా అనిపించినవి కెసిఆర్ చేసిన విమర్శలు. “అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది” అని కెసిఆర్ అన్నారు. రాజకీయాలలో ఇలాంటి విమర్శలు సహజమే గాని.. ఎన్నికల ఫలితాలను పార్టీ శ్రేణులు ఎందుకు పట్టించుకోవద్దు? అలాంటప్పుడు పార్లమెంటు ఎన్నికలను ఎందుకు పట్టించుకోవాలి? పార్లమెంట్ ఎన్నికల పై అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఎందుకు ఉండదు? అలాంటి ప్రభావం లేకుంటే ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీలు ఎందుకు భారత రాష్ట్ర సమితిని వదిలిపెట్టి కాంగ్రెస్, బిజెపి వైపు వైపు వెళ్తున్నట్టు? అంటే క్యాంపు ఖాళీ అయిపోతున్న విషయాన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నాడా?

“ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమిపాలైంది. 15 రోజుల ముందే ఈ విషయం తెలిసింది. కానీ సమయం లేకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు సాధ్యం కాలేదు. ఇప్పటికీ కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తగ్గలేదు. అయినప్పటికీ ప్రజల్లో భారత రాష్ట్ర సమితి ఉంటుంది. కచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలుస్తుంది.. ఈ ప్రభుత్వం మహా అయితే ఐదు నెలల్లో పడిపోతుంది” ఇదిగో ఇలా సాగాయి కెసిఆర్ సూత్రీకరణలు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది నిజం. ఆ ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రవర్తన, వాళ్ల అనుచరులు చేసిన అరాచకాలు.. వీటన్నిటిని కెసిఆర్ ఒప్పుకున్నట్టే కదా. అలాంటప్పుడు కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది? “వాస్తవానికి గత ఎన్నికల్లో నన్ను చూసి ఓటేశారు. ఈసారి ఎన్నికల్లోనూ నన్ను చూసే ఓటు వేయాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిన పనిలేదని” చెప్పింది కేసీఆరే కదా. కానీ దాన్ని తెలివిగా డైవర్ట్ చేయబోయి బొక్క బోర్లా పడ్డాడు. సమయం లేక మార్చకపోవడం కాదు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే.. వారు ఇతర పార్టీలోకి వెళ్లి ప్రత్యర్థులుగా నిలబడతారనే భయంతోనే కెసిఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికి పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతూనే ఉంటుంది.

వాస్తవానికి భారత రాష్ట్ర సమితికి కింగ్ కేసీఆర్ మాత్రమే. అతడు ఏం చెప్తే పార్టీలో అదే ఫైనల్. అలాంటప్పుడు 15 రోజుల ముందు ఓటమి గురించి తెలిసినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చలేకపోయాడు? అంత పెద్ద పార్టీకి సెకండ్ క్యాడర్ లేదా? అంత ఓటమిపాలైనప్పటికీ.. కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పటికీ.. దాని వెనుక ఉన్న కారణాలను విశ్లేషించకుండా కేవలం ఏవేవో చెబుతున్నాడు. చివరికి కెసిఆర్ కూడా కామారెడ్డి స్థానంలో ఓడిపోయాడు.. ఆయన అక్కడ ఎందుకు ఓడిపోయాడు? అసలు ప్రజల్లో కేసీఆర్ అంటే తిరుగులేని నమ్మకం ఉన్నప్పుడు గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో ఎందుకు పోటీ చేసినట్టు? కామారెడ్డి లో పోటీ చేయడాఎన్నో సమర్ధించుకోలేక తిప్పలు పడింది ఎవరు? చివరికి అక్కడ ఓడిపోతే దాన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల ప్రణాళికలు అమలు చేసిందెవరు?

ఆత్మ విమర్శ చేసుకోలేక కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే పని లేదని అంటున్నాడు. వాస్తవానికి ఇది ఒక మైండ్ గేమ్. రాజకీయాల్లో ఇలాంటివి కామన్. కానీ బిజెపి మితిమీరిన అంచనాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఈ తెలంగాణ ప్రజలే కదా.. కేవలం మూడు నెలల్లోనే ఆ స్థాయిలో ఎదిగిందా బీజేపీ? ఏకంగా కాంగ్రెస్ పార్టీని కూడా దాటేసిందా? ఒకవేళ ఆ పార్టీ కెసిఆర్ చెప్పినట్టు ఎదిగితే అది కాంగ్రెస్తో పోటీ పడుతుంది కదా? అప్పుడు భారత రాష్ట్ర సమితి పాత్ర ఎక్కడ ఉంటుంది? అన్నట్టు ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్న చెబుతున్న కేసీఆర్.. ఈమధ్య ఏమైనా చిలక జోస్యం నేర్చుకున్నారా?!

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version