Chiranjeevi: చిరంజీవి డొనేషన్ వెనుక భారీ స్కెచ్

ఆది నుంచి జనసేన పై ఒక అపవాదు ఉంది. పవన్ ను అభిమానించేవారు ఓట్లు వేస్తే చాలు.. ఆయనకు సరైన గౌరవం దక్కుతుందని విశ్లేషణలు ఉన్నాయి. పలు సందర్భాల్లో పవన్ సైతం ఇదే చెప్పుకొచ్చారు.

Written By: Dharma, Updated On : April 9, 2024 10:01 am

Chiranjeevi

Follow us on

Chiranjeevi: మెగా అభిమానుల్లో అస్పష్టతను, అయోమయాన్ని చిరంజీవి తెరదించారు. జనసేనకు ఐదు కోట్ల విరాళం ఇవ్వడం ద్వారా.. తన సపోర్టు జనసేనకేనని స్టేట్మెంట్ ఇచ్చినట్లు అయ్యింది. తమ్ముడి పార్టీకి అన్న విరాళం ఇవ్వడంలో విశేషం ఏంటని ఉండొచ్చు కానీ.. ఎన్నికల ముంగిట ఇదో కీలక పరిణామంగా చూడొచ్చు. మెగా అభిమానుల్లో ఎప్పటినుంచో వర్గాలు ఉన్నాయి. చిరంజీవిని అభిమానించేవారు పవన్ వ్యతిరేకిస్తున్నారు. పవన్ అభిమానించేవారు చిరంజీవిని వ్యతిరేకిస్తున్నారు. బాహటంగా విమర్శలు చేస్తున్నవారు ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి చిత్ర పరిశ్రమ కోసం సన్నిహితంగా మెలిగారు. దీంతో చిరంజీవి విషయంలో జనసేనలో ఒక రకమైన అభిప్రాయం నెలకొంది. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా.. అభిమానులంతా ఏకతాటిపై నడవాలని చెప్పినట్లు అయింది.

ఆది నుంచి జనసేన పై ఒక అపవాదు ఉంది. పవన్ ను అభిమానించేవారు ఓట్లు వేస్తే చాలు.. ఆయనకు సరైన గౌరవం దక్కుతుందని విశ్లేషణలు ఉన్నాయి. పలు సందర్భాల్లో పవన్ సైతం ఇదే చెప్పుకొచ్చారు. అటువంటిది మెగా అభిమానులను ఏకతాటిపైకి తెస్తే.. దాని ఫలితం వేరేలా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి అదే పనికి పూనుకున్నారు. జనసేనకు భారీ విరాళం ఇవ్వడం ద్వారా మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. అభిమానుల్లో వర్గాల వల్ల ఓట్ల చీలిక జరిగి.. వైసీపీకి మేలు జరుగుతుందని ఉద్దేశంతోనే చిరంజీవి తమ్ముడికి పూర్తి మద్దతు ప్రకటించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెగా అభిమానులు పవన్ కు అండగా నిలవాలన్న సంకేతాలు చిరంజీవి పంపినట్లు అయింది.

ఇప్పటివరకు చిరంజీవి చాలామందికి విరాళాలు ఇచ్చారు. కష్టంలో ఉన్న వారికి సాయం చేశారు. కానీ అది ఎప్పుడూ బయట పెట్టేందుకు ఇష్టపడలేదు. అంతెందుకు చిరంజీవి కంటే ముందు నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్ సైతం జనసేనకు విరాళాలు ఇచ్చారు. కానీ వారు తమ పనిని సైలెంట్ గా చేశారు. అయితే ఎప్పుడు సైలెంట్ గా విరాళాలు ఇచ్చే చిరంజీవి మాత్రం ఈసారి తమ్ముడికి బాహటంగానే చెక్కు అందించారు. దీనిని ఒక కార్యక్రమంలా నిర్వహించారు. పవన్ కు కేవలం ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా తమ కుటుంబ మద్దతు ఉంటుందని తెలిసేలా చేశారు. మెగా అభిమానుల విషయంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా అయోమయం సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈసారి చిరంజీవి జాగ్రత్త పడ్డారు. జనసేనకు భారీ విరాళం ఇచ్చి అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. మరి మెగా అభిమానులు ఏకతాటిపై నిలుస్తారో? లేదో? చూడాలి.