Tadipatri: కేతిరెడ్డి ఎంట్రీతో తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ యాక్షన్.. జెసి వర్గీయుల రియాక్షన్!

రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా తాడిపత్రి. పోలింగ్ లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతున్న తరుణంలో.. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీతో సీన్ మారిపోయింది. తాడిపత్రి పట్టణం అట్టుడికి పోయింది.

Written By: Dharma, Updated On : August 21, 2024 8:11 am

Tadipatri

Follow us on

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి నియోజకవర్గానికి దూరంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నారు. వ్యక్తిగత పని నిమిత్తం ఆయన మంగళవారం తాడిపత్రి వచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగడంతో.. టిడిపి వర్గాలు కూడా స్పందించాయి. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. టిడిపి శ్రేణులు పెద్దారెడ్డి అనుచరులైన కంది గోపుల మురళి, రఫీ అనే మరో వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు. ఇల్లు, కారు ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను పగలగొట్టారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద రెడ్డి అనుచరుడు మురళి గన్ తో హల్చల్ చేశారు. టిడిపి శ్రేణులు ఆయన ఇంటి మీద దాడి చేయగా.. ఆయన తుపాకీ తీసుకొని వారిని బెదిరించారు. దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయి దాటకుండా టిడిపి శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఎన్నికల అనంతరం తాడిపత్రి ప్రశాంతంగా ఉంది.పెద్దారెడ్డి నియోజకవర్గాన్ని విడిచిపెట్టారు. ఆయన ఎంట్రీ తోనే సీన్ మారింది.

* నివురుగప్పిన నిప్పు
వైసిపి హయాంలో పెద్ద రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. దీనిపై జెసి వర్గం కూడా ప్రతిస్పందించేది. ఈ క్రమంలో అధికార పార్టీగా ఉన్న వైసిపి జెసి కుటుంబం పై కేసులు నమోదు చేసింది. అప్పట్లో ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండగా.. మున్సిపల్ చైర్మన్ గా జెసి ప్రభాకర్ రెడ్డి ఉండేవారు. దీంతో వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఇటీవలే తన వ్యాపారాలను దెబ్బతీయడమే కాకుండా మానసిక ప్రశాంతత లేకుండా చేశారంటూ జెసి ప్రభాకర్ రెడ్డి బలప్రదర్శనకు దిగారు. ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేశారు. తాజా ఘటనపై సైతం జేసీ స్పందించారు. వైసిపి కవ్వింపు చర్యల కారణంగానే తమ కార్యకర్తలు దాడి చేశారని ప్రభాకర్ రెడ్డి అన్నారు.

* పోలీసులకు తెలిసినా
అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్న విషయం పోలీసులకు ముందుగానే తెలుసు. పొలిమేరలోనే ఆయనను అడ్డుకున్నారు. అయితే కొన్ని కీలకమైన ఫైల్స్ తీసుకెళ్లాల్సి ఉందని.. వ్యక్తిగత పనిమీద తాను తాడిపత్రి వెళ్తున్నట్లు పెద్దారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టేసరికి సీన్ మారింది. ఒకవైపు వైసీపీ శ్రేణులు కవ్వింపుతో.. టిడిపి శ్రేణులు అదే రీతిలో రియాక్ట్ అయ్యాయి. ఫలితంగా విధ్వంసాలు జరిగాయి.

* చంపేందుకే కుట్ర : పెద్దారెడ్డి
నన్ను చంపేందుకే ఈ కుట్ర చేశారంటూ పెద్దారెడ్డి ఆరోపణలు చేశారు. గతంలో తన సోదరుని చంపేశారని.. దాని వెనుక జెసి కుటుంబ హస్తం ఉందని ఆరోపించారు. ఇప్పుడు వ్యక్తిగత పని మీద వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. తనను సైతం చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని మానవ హక్కుల సంస్థకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాడిపత్రి రాజకీయాలకు అడ్డొస్తానన్న కారణంగానే తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ అనుమతితో మరోసారి తాడిపత్రికి వెళ్తానని.. జేసీ అక్రమాలపై పోరాటం చేస్తానని కేతిరెడ్డి ధర్మారెడ్డి చెబుతున్నారు.