Heavy Rains in AP : ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా మేఘావృత్తమైన వాతావరణం ఏర్పడింది. మరోవైపు రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు దానికి ఉపరితల ఆవర్తనం తోడు కావడంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు తాకాయి. కేరళకు ఈ నెల 27న తాకనున్నాయి. జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. అంతకంటే ముందే ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో భారీ వర్షాలు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
* ముందుగానే హెచ్చరికలు..
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి( Bay of Bengal) ఆనుకొని.. దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆపై ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఒకవేళ ఏదైనా అత్యవసర సమాచారం, సహాయం కొరకు విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్స్ 1070, 112, 18004250101 నంబర్లకు సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Also Read : ఆ నాలుగు జిల్లాల్లో హై అలెర్ట్ .. బయటకు రావద్దు.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక!
* భారీ వర్షాలు నమోదు..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కాకినాడ జిల్లా( Kakinada district) కరవలో 65.2 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా కటిక పల్లి లో 53 మీటర్లు, కోనసీమ జిల్లా మండపేటలో 48.7 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా ఆర్యావటంలో 46.2, మధ్య కొంపలు 44.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. రానున్న రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్లు, పాత గోడలు, భవనాల వద్ద నిలబడ వద్దని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
* కాస్త ముందుగానే రుతుపవనాలు..
వాస్తవానికి కేరళకు( Kerala) ఈనెల 27న రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తాజాగా అంచనా వేస్తున్నారు. ఆ తరువాత ఈ నెల 26 నాటికి రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్ కు రుతుపవనాలు వస్తాయని నిపుణుల అంచనా. గతంలో మే 30న రుతుపవనాలు కేరళకు తాకేవి. ఈసారి మాత్రం కాస్త ముందుగానే ప్రవేశిస్తున్నాయి. రుతుపవనాలు ఒకేసారి కేరళ, ఈశాన్య ప్రాంతాలకు తాకడం చాలా అరుదుగా జరుగుతుందని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. 2017 లో ఇలా జరిగిందని.. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.