Koneti Adimulam: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇసుక దందాపై ధర్మవరం టీడీపీ నేత జేపీ ప్రభాకర్‌రెడ్డి సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేశారు. ఇక అనేక అక్రమాలకు ప్పాడుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. తాజాగా టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధిష్ఠానం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.
సొంత పార్టీ నాయకురాలిపైనే..
ఇదిలా ఉంటే.. ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మిపైనే లైంగికదాడి చేసినట్లు బాధితురాలే తెలిపింది. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించారని ఆరోపించింది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను పెన్ కెమెరాలో వీడియో తీశానని వెల్లడించింది. తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే ఆయన తనకు అనేకమార్లు ఫోన్లుచేశారని.. రాత్రిపూట మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని.. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఆమె మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇదే విషయమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాలన్నీ విధిలేని పరిస్థితుల్లో వెల్లడించాల్సి వస్తోందన్నారు.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో..
ఇద్దరం ఒకే పార్టీకి చెందిన వారం కావడంతో పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరం పాల్గొనే వారం. కొద్దిరోజులకు నా ఫోన్ నెంబర్ తీసుకుని పదేపదే ఫోన్లు చేయడం ప్రారంభించారని తెలిపింది. ఎన్నికలు ముగిసే వరకూ నన్ను సోదరిగా సంభోదించారు. ఆ తర్వాత ఆయన తన నిజస్వరూపం బయటపెట్టారని పేర్కొంది. ఆయనతో సన్నిహితంగా ఉండాలంటూ బెదిరింపులకు దిగారు. తమ మాట వినకపోతే భర్త, ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని, పార్టీ పరంగా ఎలాంటి లబ్ది చేకూరకుండా చేస్తాననే వారు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలతో పార్టీ అతనిపై చర్య తీసుకుంది.
ఆదిమూలంకు గుండెపోటు..
ఇదిలా ఉంటే సస్పెన్షన్ వేటు పడ్డ ఆదిమూలం తీవ్ర మానసిక ఒత్తడికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. ఆదిమూలం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.