https://oktelugu.com/

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి ఆ బోట్లు పంపించింది ఆయనే.. వీడియో వైరల్

ఏపీ ప్రజలు వరదల్లో చిక్కుకుంటే.. పార్టీలు మాత్రం వివాదాలతో కీచులాడుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి బోట్లు కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కుట్ర కోణం ఉందని.. తప్పు మీదంటే మీది అంటూ టిడిపి,వైసిపి ఆరోపణలు చేస్తుండడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : September 11, 2024 / 08:42 AM IST

    Prakasam Barrage

    Follow us on

    Prakasam Barrage: ఇటీవల భారీ వర్షాలకు కృష్ణానది ఉదృతంగా ప్రవహించింది. భారీ వరద నీరు చేరడంతో ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. దీంతో అధికారులు బ్యారేజీ నుంచి నీటిని విడిచిపెట్టారు. ఆ సమయంలో పై భాగం నుంచి మూడు బోట్లు కొట్టుకు వచ్చాయి. ఆ బోట్లు ధాటికి ప్రకాశం బ్యారేజీ లోని 67, 68, 69 గేట్లు దెబ్బతిన్నాయి. అయితే సహజంగానే కృష్ణా నదికి వరదలు రావడంతో పై ప్రాంతం నుంచి బోట్లు కొట్టుకు వచ్చాయని అంతా భావించారు. అయితే ఆ బోట్లు పై వైసీపీ రంగులు ఉండడంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ చేసిన విద్రోహ చర్యగా కూటమి ప్రభుత్వం భావించింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మాజీ ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాం ప్రధాన అనుచరుడు కుట్ర దారుడుగా నిర్ధారణకు వచ్చింది. వారి అనుచరుడుగా భావిస్తున్న కోమటి ఉషాద్రి రామ్మోహన్ ను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.

    * లోకేష్ అనుచరుడే
    అయితే దీనిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసలు ఉషాద్రి రామ్మోహన్ తమ పార్టీ వారు కాదని తేల్చి చెబుతోంది. ఆయన మంత్రి లోకేష్ కు సన్నిహితుడని చెప్పుకొస్తోంది. మంత్రి లోకేష్ తో ఉషాద్రి రామ్మోహన్ తీసుకున్న ఫోటోను బయటపెట్టింది. ఆయన టిడిపి ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు సన్నిహితుడని చెబుతోంది. ఈ కుట్ర కోణం వెనుక మంత్రి లోకేష్ ఉన్నారని ఆరోపిస్తోంది. అందుకే వైసీపీని బదనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తోంది.

    * అప్పటివే ఈ బోట్లు
    మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. 164 స్థానాలతో గెలుపొందింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. దేశ విదేశాల్లో సైతం విజయోత్సవాలు జరిగాయి. అందులో భాగంగా కృష్ణాజిల్లాలో సైతం సంబరాలు మిన్నంటాయి. అదే సమయంలో కృష్ణా నదిలో టిడిపి జెండాలతో కొన్ని బోట్లలో సందడి చేశాయి. అయితే తాజాగా ప్రకాశం బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చిన బోట్లు.. నాడు టిడిపి విజయోత్సవం జరుపుకున్న బోట్లు ఒకటేనంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. అవి టిడిపి సానుభూతిపరుడికి చెందిన బోట్లు అని.. ఇప్పుడు కావలసిన రాజకీయం చేస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది.

    * ముమ్మర దర్యాప్తు
    గత కొద్ది రోజులుగా ఈ బోట్ల వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే ఇది వైసీపీ చేసిన కుట్ర అని టిడిపి ఆరోపిస్తోంది. మంత్రి లోకేష్ అనుచరుడు కావడం వల్లే.. ఇప్పుడు వైసీపీపై నెపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు దీనిని కుట్ర కోణంగా చూస్తున్న కూటమి ప్రభుత్వం..సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.మున్ముందు ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉంది.