https://oktelugu.com/

Andhra Pradesh: వైసీపీ అవలక్షణాలను టిడిపి ఒంటపట్టించుకుందా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా తగులుకున్నాడేంటి?

తెలుగుదేశం పార్టీకి ఈనాడు తర్వాత ఆ స్థాయిలో నమ్మకమైన మీడియాగా ఆంధ్రజ్యోతి కొనసాగుతోంది. ఇందులో ఎటువంటి దాపరికం లేదు. పైగా ఈనాడైనా అప్పుడప్పుడూ న్యూట్రల్ ముసుగు వేసుకుంటుంది గాని.. ఆంధ్రజ్యోతి అయితే పోతురాజు మాదిరి లాగా పసుపు రంగు పూసుకొని బజార్లో పడి కొట్టుకుంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 28, 2024 / 02:09 PM IST

    Andhra Pradesh

    Follow us on

    Andhra Pradesh: ఇటీవల ఎన్నికల్లో మార్గదర్శి మీద దాడులు.. ఇతర వ్యవహారాల వల్ల ఈనాడు కాస్త ఓపెన్ అయిపోయింది గాని.. ఇలాంటి వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి ఎప్పటినుంచో కొనసాగిస్తోంది. చంద్రబాబుకు అనుకూలంగా.. ఆయనకు గిట్టని పార్టీల మీద వ్యతిరేకంగా చాలాకాలం నుంచి రాస్తూనే ఉంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నకు ఇక్కడ తావు లేదు. ఎందుకంటే చంద్రబాబుతో అతికినంత ఈజీగా రాధాకృష్ణకు ఇతర నాయకులతో అంతగా పొసగదు. కెసిఆర్ తో అంతటి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ.. ఎక్కడో తేడా కొట్టింది. అందుకే ఇద్దరు ఉప్పు నిప్పులాగా మారిపోయారు. కానీ చంద్రబాబుతో రాధాకృష్ణకు ఇంతవరకు అలాంటి పరిస్థితి రాలేదు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. పైగా ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఈ ఐదు సంవత్సరాలు రాధాకృష్ణ ప్రతిరోజు పండగ చేసుకుంటాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇదే దశలో చంద్రబాబుకు అనుకూలంగానే రాధాకృష్ణ పత్రిక ఆంధ్రజ్యోతి వార్తలు రాస్తోంది. జగన్ మీద ఇప్పటికీ బురద చల్లుతూనే ఉంది. సరే ఇది జాతి వైరం అనుకుందాం..

    హఠాత్తుగా ఆంధ్రజ్యోతి ఒక్కసారిగా రూటు మార్చింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్త ప్రచురించింది. సహజంగానే ఇలాంటి పరిణామం టిడిపి నాయకులకు రుచించదు. పైగా ఆంధ్రజ్యోతి అనేది తమ జాతి వాడికి చెందిన పత్రిక కాబట్టి.. వారు ఎప్పటినుంచో ఓన్ చేసుకుంటున్నారు. మరి అకస్మాత్తుగా ఆంధ్రజ్యోతి ఇలా బ్యానర్ వార్త ప్రచురించడం నిజంగానే ఆశ్చర్యం. ఇంతకీ ఆ వార్తలో ఏముందంటే..

    గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గా గల్లా మాధవి ఇటీవల గెలిచారు. ఆమె భర్త మాధవరావు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పొలం అమ్మలేదని కమ్మ వెంకటరావు అనే వ్యక్తిని వేధించాడు. 30 లక్షల కే 4 ఎకరాలు అమ్మాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. పైగా ఆ వ్యక్తి మీద ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టించాడు.. దీంతో ఈ విషయం ఒకసారిగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ వార్తను సాక్షి మాత్రమే ప్రచురిస్తుంది, ప్రసారం చేస్తోంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆంధ్రజ్యోతి ఏకంగా “నాలుగు ఎకరాలు .. 30 లక్షలు” అనే శీర్షికతో వార్త ప్రచురించింది.

    మాధవరావు వ్యవహారం అలా ఉంటే.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై నిరసనకు దిగారు. కేసు నమోదు చేయాలని సిఐపై ఒత్తిడి తీసుకొచ్చారు. సిఐ ఆ పని చేయకపోవడంతో తనకు క్షమాపణ చెప్పాలని ఆందోళన చేశారు. చివరికి ఉన్నతాధికారుల సూచనతో ఆ సిఐ అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పారు. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా చర్చకు దారి తీసింది. ఆస్మిత్ రెడ్డి దూకుడు పట్ల స్థానికంగా ఉన్న టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రజ్యోతి బాటమ్ వార్తగా దీనిని ప్రచురించింది.

    ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అయితే ఇందులో విశేషం ఏముందంటారా.. ఆమె ఎమ్మెల్యే భార్య కావడంతో పోలీసులు దగ్గరుండి మరి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. అంతేకాదు గతంలో పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు టోల్ గేట్ వద్ద వెంకట కుమారి వాహనాన్ని ఆపినందుకు పెద్ద గొడవ సృష్టించారు..

    పై ఉదంతాలను ఒక్కొక్కటిగా హైలెట్ చేస్తూ.. ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ బ్యానర్ వార్త గారు రూపొందించాడు. వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఇలానే చేసిందని.. మార్పు కోసం ప్రజలు ఆలోచన చేస్తే.. అలాంటి అవలక్షణాలను కూటమి ఎమ్మెల్యేలు ఒంట పట్టించుకున్నారని రాధాకృష్ణ నేరుగానే రాసేసాడు. సహజంగానే చంద్రబాబుపై అమితమైన స్వామి భక్తి ప్రదర్శించే రాధాకృష్ణ.. ఒకసారి గా ఇలా తన పత్రికలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయడం.. ముగ్గురు ఎమ్మెల్యేలు, వారి బంధువుల వ్యవహార శైలిని ఎండగట్టడం ఇక్కడ విశేషం. మరి చంద్రబాబు – రాధాకృష్ణకు మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా.. లేక ఈ ఎమ్మెల్యేలతో గ్యాప్ వచ్చిందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి