https://oktelugu.com/

Asifabad: ట్యాంకర్ లో నిండా పాలు.. అనుమానం వచ్చి చెక్ చేస్తే.. పోలీసులకు దిమ్మ తిరిగే షాక్..

పుష్ప సినిమా చూశారా.. అందులో ఎర్రచందనాన్ని అల్లు అర్జున్ ప్రత్యేకమైన వాహనాలలో అక్రమంగా తరలిస్తుంటాడు. పైకి ట్యాంకర్లలో పాలు ఉన్నప్పటికీ.. కింది భాగంలో ఎర్రచందనం చెక్కలను అక్రమంగా రవాణా చేస్తూ ఉంటాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 1, 2024 4:45 pm
    Asifabad

    Asifabad

    Follow us on

    Asifabad: పుష్ప సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారేమో.. ఇంకోటో తెలియదు గాని.. అక్రమార్కులు ఏకంగా పాల ట్యాంకర్లలో గంజాయి దర్జాగా రవాణా చేయడం మొదలుపెట్టారు. అయితే పోలీసులు తనిఖీ చేయగా.. వారి అక్రమం బయటపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్ కు అక్రమార్కులు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటన కుమురం భీం ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్ కు ఓ పాల ట్యాంకర్ వెళ్తోంది. డ్రైవర్ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ట్యాంకర్ ను ఆపారు. ఆ తర్వాత తనిఖీ చేశారు. ట్యాంకర్ మధ్య భాగంలో ప్రత్యేకంగా అరలు తయారు చేశారు. అందులో దాదాపు 290 కిలోల గంజాయిని భద్రపరిచారు. దానిని ప్రత్యేకంగా ప్యాకెట్లలో ప్యాక్ చేశారు. ఆ గంజాయి విలువ 72.50 లక్షల ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ తో పాటు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, పాల ట్యాంకర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రైవర్ పేరు బల్వీర్ సింగ్ అని, అతడు అక్రమంగా గంజాయి రవాణాలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు పేర్కొన్నారు.

    కొంతకాలంగా..

    అక్రమార్కులు పుష్ప సినిమా చూసి గంజాయిని ఈ విధంగా అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. బల్వీర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. గంజాయి రవాణా వెనుక ఎవరు ఉన్నారు? వీరు ఎక్కడి నుంచి గంజాయి తీసుకొస్తున్నారు? చెక్ పోస్టు లను విజయవంతంగా దాటుకొని గంజాయిని ఎలా చేరవేరుస్తున్నారు? వీరికి సహకరిస్తున్న అధికారులు ఎవరు? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ గంజాయి రవాణా వెనుక అతిపెద్ద శక్తులు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే వారిని పట్టుకుంటామని.. చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పోలీసులు చెబుతున్నారు. కాగా, ట్యాంకర్ లో గంజాయి దొరికిన సంఘటన కుమురం భీమ్ జిల్లాలో సంచలనంగా మారింది. అయితే ఈ గంజాయిని ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రకు అక్రమార్కులు తరలిస్తున్నారని తెలుస్తోంది. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి.. మహారాష్ట్రలో ఎక్కువకు అమ్ముతున్నారని తెలుస్తోంది. అయితే వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. కొంతకాలంగా పోలీసు అధికారులు ఈ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పలుమార్లు గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. కానీ ఇంత మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. భారీగా గంజాయి లభించిన నేపథ్యంలో మరింతగా దృష్టి సారిస్తామని పోలీసులు చెబుతున్నారు.