Gudivada Amarnath: మూడు రాజధానులకు తిరస్కారం.. గుడివాడ అమర్నాథ్ సంచలనం

2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 33 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 7వేల కోట్లతో వివిధ నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి.

Written By: Dharma, Updated On : June 6, 2024 3:53 pm

Gudivada Amarnath

Follow us on

Gudivada Amarnath: ఏపీలో వైసీపీకి దారుణ పరాజయం ఎదురయ్యింది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేదు. అన్నిచోట్ల అదే పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అయితే వైట్ వాష్ చేసింది. ఉత్తరాంధ్రలో అయితే రెండు స్థానాలకు పరిమితం అయ్యింది. దీంతో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానులకు ప్రజలు హర్షించలేదని స్పష్టమైంది. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో కూడా ప్రజలు మద్దతు తెలపలేదు. అమరావతిలో కూడా ఆదరణ దక్కలేదు. దీంతో వైసీపీలోనే రాజధాని అంశంపై స్వరం మారుతోంది.

2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 33 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 7వేల కోట్లతో వివిధ నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రపంచానికి తలమానికంగా అమరావతి రాజధాని నిర్మిస్తామని నాడు చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే పనులు జరుగుతుండగానే 2019 ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం, వైసిపి అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఇలా అధికారంలోకి వచ్చిన తరువాత వైసిపి సర్కార్ అమరావతి పై విషం చిమ్మింది. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటినుంచి అమరావతి ఉద్యమం ప్రారంభమైంది. పతాక స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఉక్కు పాదం ఎదురయ్యింది. అలాగని మూడు రాజధానుల అంశం సైతం పురుడుబోసుకోలేదు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. విశాఖపట్నం ప్రజలు కూడా ఆహ్వానించలేదు. అదే సమయంలో అమరావతికి వేదికగా నిలిచే గుంటూరు, కృష్ణాజిల్లాలో సైతం వైసీపీకి ప్రాతినిధ్యం దక్కలేదు. రెండింటికి చెడ్డ రేవడిగా మారింది వైసీపీ పరిస్థితి.

ఈ ఎన్నికల్లో గెలిస్తే విశాఖ నుంచి ప్రమాణస్వీకారం చేస్తానని జగన్ ప్రకటించారు. జూన్ 9న ప్రమాణ స్వీకారానికి వైసీపీ నేతలు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. అదే రోజున విశాఖలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు బుక్ అయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తద్వారా విశాఖ రాజధాని అని ముందుగానే సంకేతాలు పంపించారు. కానీ వారు అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి అన్న పరిస్థితి తయారయ్యింది. కనీసం ప్రజలు ఆహ్వానించలేదు. వైసీపీని ఆదరించలేదు. దారుణంగా తిరస్కరించారు. దీనిపై మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు రాజధానికి రెఫరండంగా తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు విశాఖ రాజధానిని ఆహ్వానించలేదని చెప్పుకొచ్చారు. ఓటమి పై పోస్టుమార్టం చేస్తామని.. ఎక్కడలోపం జరిగిందో తెలుసుకుంటామని ప్రకటించారు.మొత్తానికైతే రాజధానుల విషయంలో తప్పు జరిగిందని వైసీపీ నేతలు ఒప్పుకోవడం విశేషం.