Australia Vs Oman: స్టోయినీస్ విశ్వరూపం.. ఆస్ట్రేలియా ఘనవిజయం..

స్టోయినీస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా మెహరాన్ ఖాన్ వేసిన 15 ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. 27 బంతుల్లోనే అర్థ శతకం చేసిన అతడు మరింత వేగంగా ఆడాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 6, 2024 3:59 pm

Australia Vs Oman

Follow us on

Australia Vs Oman: టి20 వరల్డ్ కప్ ఫేవరెట్ జట్లలో ఒకటైన ఆస్ట్రేలియా.. అదిరిపోయే విజయాన్ని అందుకుంది. గురువారం బార్బోడోస్ వేదికగా ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల తేడాతో గెలుపొందింది. గ్రూప్ బీ లో ఉన్న ఈ జట్లు లీగ్ మ్యాచ్ లో భాగంగా తలపడ్డాయి.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టోయినీస్ అటు బంతి, ఇటు బ్యాట్ తో చెలరేగాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ గమనం మారిపోయి.. ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్ళింది..స్టోయినీస్ 36 బంతుల్లో 67 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. మూడు వికెట్లు పడగొట్టి బౌలింగ్ లోనూ అదరగొట్టాడు.. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.

ఈ మ్యాచ్లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. ఐదు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.స్టోయినీస్ 67 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా ఆమాత్రం స్కోర్ చేయగలిగింది.. ఒమన్ బౌలర్లలో మెహరాన్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ వాటికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగింది. 12 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 63 పరుగులు మాత్రమే చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత స్టోయినీస్ రాకతో స్కోర్ బోర్డులో వేగం పెరిగింది.

స్టోయినీస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా మెహరాన్ ఖాన్ వేసిన 15 ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. 27 బంతుల్లోనే అర్థ శతకం చేసిన అతడు మరింత వేగంగా ఆడాడు. మరో ఎండ్ లో వార్నర్ కూడా అతనికి సహకరించాడు. బౌలింగ్ కు సహకరిస్తున్న మైదానంపై నిదానంగా ఆడి 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వార్నర్, స్టోయినీస్ కలిసి నాలుగో వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో.. చివరి ఎనిమిది ఓవర్లలో ఆస్ట్రేలియా ఏకంగా 101 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఒమన్ 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఆ జట్టులో అయాన్ ఖాన్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్యాట్ తో అదరగొట్టిన స్టోయినీస్.. బౌలింగ్ లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు.. స్టార్క్, జంపా, ఎలీస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చేజింగ్ నాటికి మైదానం బౌలింగ్ కు అనుకూలించినప్పటికీ.. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా ఒమన్ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనం సాగించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి 57 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన స్థితిలో మెహరాన్ ఖాన్ (27), అయాన్ పోరాడి ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించారు.