Dwakra Group: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. తొలి విడతగా 55 కోట్ల రూపాయలతో 129 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటుకు సిద్ధమైంది. ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. నవంబర్ రెండవ వారంలో వీటిని గ్రౌండింగ్ చేయనుంది. డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 60 లక్షల వరకు ప్రాజెక్టు వ్యయం ఉండేలా ఈ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించనున్నారు. తొలి విడతలో అమలు తీరు పరిశీలించిన తర్వాత.. రెండో విడతలు మరో 13 వేల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు.129 ప్రాజెక్టులను సంఘాలుగా కాకుండా వ్యక్తిగతంగా ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చిన వారికి కేటాయించింది ఏపీ ప్రభుత్వం.మొత్తం 64 మంది మహిళలు కొత్త పరిశ్రమలు నెలకొల్పుతుండగా.. మరో 65 మంది ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నారు.
* కేంద్ర పథకాలతో అనుసంధానం
కేంద్ర ప్రభుత్వ పథకాలుగా పిఎం ఎఫ్ఎంఈ,పీఎం ఈజిపి కొనసాగుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమల ఏర్పాటుకు వాటితో అనుసంధా నించింది. ఈ మేరకు ఒక్కో సభ్యురాలికి మొత్తం వ్యయంలో 35% రాయితీ, 10% లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా ప్రభుత్వమే ఇప్పిస్తుంది. దీనికి సంబంధించి డిపిఆర్ ఇప్పటికే పూర్తి చేశారు. బ్యాంకుల నుంచి చాలామంది డ్వాక్రా మహిళలకు రుణాలు కూడా మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైనఅన్ని ఏర్పాట్లు మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో లబ్ధిదారులు ఉండేలా చర్యలు చేపట్టారు.
* ఫుడ్ ప్రాసెసింగ్ కు ప్రాధాన్యం
ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.బేకరీ,స్నాక్స్ యూనిట్,కిరాణా షాపులు, పచ్చళ్ళ తయారీ, డైరీ ఫామ్, సిమెంట్ బ్రిక్స్ యూనిట్, ఐస్ క్రీమ్ తయారీ, కారంపొడి తయారీ, తేనె తయారీ, గార్మెంట్స్, ఎంబ్రాయిడరీ, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు, హైజిన్ ప్రొడక్ట్స్, బెల్లం ఉత్పత్తి, ఆయిల్ మిల్, మిల్లెట్ అండ్ హెర్బల్ యూనిట్లుఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం తమ మానస పుత్రిక అయిన డ్వాక్రా వ్యవస్థపై దృష్టి పెట్టడం విశేషం.