Amaravati: అమరావతి కి గుడ్ న్యూస్.. మరో జాతీయ సంస్థ రాక

2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 250 కోట్ల బడ్జెట్తో ఈ క్యాంపస్ ఏర్పాటుకు అప్పట్లో ఆ సంస్థ సిద్ధమైంది.

Written By: Dharma, Updated On : July 5, 2024 11:08 am

Amaravati

Follow us on

Amaravati: అమరావతి రాజధానిలో కీలక అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అభివృద్ధితో పాటు కొత్త సంస్థల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. జాతీయస్థాయి విద్యాసంస్థల రాక ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో కేంద్ర సంస్థలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మారిన పరిస్థితులతో అవి అమరావతి బాట పడుతున్నాయి. అందులో భాగంగా దేశంలోనే అత్యంత పురాతన బిజినెస్ స్కూళ్లలో ఒకటైన జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తమ క్యాంపస్ ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడం విశేషం.

2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 250 కోట్ల బడ్జెట్తో ఈ క్యాంపస్ ఏర్పాటుకు అప్పట్లో ఆ సంస్థ సిద్ధమైంది. ప్రభుత్వం మారడంతో నిర్ణయం మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో.. తిరిగి జేవియర్ బిజినెస్ స్కూల్ తమ క్యాంపస్ ను అమరావతిలో పెడతామని ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ తో చర్చలు జరిపింది ఆ యాజమాన్యం.

అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు అవుతుంది ఈ క్యాంపస్. జాతీయస్థాయిలో అడ్మిషన్లు ఉంటాయి. 5000 మంది విద్యార్థులు చదువుకునేందుకు పీజీ, యూజీ కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. జాతీయస్థాయిలో కూడా అడ్మిషన్లు జరుగుతాయి. 1949లో స్టీల్ సిటీ జంషెడ్పూర్ లో ఏర్పాటు అయిన జేవియర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు ఢిల్లీలోని జజ్జార్లో కూడా క్యాంపస్ ఉంది. జాతీయస్థాయిలో ప్రస్తుతం 9వ ర్యాంకులో ఉన్న ఈ ప్రతిష్టాత్మక కాలేజీ.. అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేస్తే ఏపీలో బిజినెస్ స్కూల్ లేని కొరత తీరనుంది. మరిన్ని జాతీయ సంస్థలు అమరావతికి వచ్చేందుకు ఇది దోహద పడనుంది.