Godavari Water Dispute: ఉన్న దాని గురించి ఆలోచించం.. లేని దాని గురించి పాకులాడుతుంటాం. ఇప్పుడు గోదావరి జలాల( Godavari water) వినియోగం విషయంలో సైతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిస్థితి ఇలానే ఉంది. గోదావరి, తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న మహానది. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జలాల సమస్య ఉండనే ఉంది. కానీ వాటిని పరిష్కరించేందుకు ఏ ప్రభుత్వం కూడా చొరవ చూపలేదు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ లో టిడిపి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ ఏర్పాటు చేసింది. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా విభేదించుకోవడంతో విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. అటు తరువాత తెలంగాణలో కెసిఆర్, ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు కానీ.. ఇద్దరూ స్నేహితులే అయినా సమస్యలు మాత్రం పట్టించుకోలేదు. తాజాగా ఏపీలో చంద్రబాబు.. తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చారు. విభజన సమస్యలపై ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. అయితే ఏపీలో పోలవరం, బనకచర్ల అనుసంధానం వైపు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గోదావరి జలాల వినియోగం పై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి.
Also Read: Godavari : నేల కూలిన సినీ వృక్షం.. ఆ చెట్టు కింద 300 సినిమాల చిత్రీకరణ.. విషాదంలో సినీ అభిమానులు!
పోలవరం, బనకచర్ల అనుసంధానం..
ప్రస్తుతం గోదావరి నది నుంచి సముద్రంలోకి వృధాగా మూడు వేల టీఎంసీల( 3000 TMC) నీరు కలుస్తోంది. ఇలా కలుస్తున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం అయినట్టే. అయితే ఈ వృధా జలాల వినియోగం విషయంలో రాజకీయ పార్టీలు తలో దిక్కులా ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడారు. తొలి వెలుగు సభపై గోదావరి జలాల వినియోగం పై కామెంట్స్ చేశారు. గోదావరి మిగులు జలాలు మూడువేల టీఎంసీలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా వాడుకుంటే సస్యశ్యామలం చేసుకోవచ్చని చంద్రబాబు సూచిస్తున్నారు. అందులో భాగంగానే పోలవరం, కనకచర్ల అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ మిగులు జలాల్లో 200 టీఎంసీలు వినియోగించుకుంటే.. రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని.. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు.
తెలంగాణ నుంచి అభ్యంతరాలు..
అయితే తెలంగాణలో( Telangana) మాత్రం దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మిగులు జలాల్లో సింహభాగం ప్రయోజనాలు తమకే కావాలని అక్కడ రాజకీయ పార్టీలు పట్టుపడుతున్నాయి. 3000 టీఎంసీల నీటిలో.. దాదాపు 1950 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సిందేనని అక్కడ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుండడం విశేషం. అయితే దీనిపై గతంలో కెసిఆర్ కేంద్ర జల వనరుల శాఖకు లేఖ కూడా రాశారు. కేవలం హైదరాబాద్ అవసరాలకి 1000 టీఎంసీల నీరు అవసరం అని.. కోటి జనాభా ఉన్న భాగ్యనగరానికి నీరు అవసరమని అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సముద్రంలోకి వృధాగా వెళుతున్న 3000 టీఎంసీల నీటిని ఇన్ని రోజులు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోలేకపోయాయి. కానీ ఇప్పుడిప్పుడే వాటిని వినియోగించుకోవాలన్న ఆలోచన వచ్చిన క్రమంలో విభేదాలు తెరపైకి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు గోదావరి నీటి ప్రధాయిని. కానీ ఆ జలాలను సమానంగా సద్వినియోగం చేసుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాలకు సుభిక్షం. మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.