Kaleshwaram : త్రివేణి సంగం ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని హిందువులు విశ్వసిస్తారు. అందుకే త్రివేణి సంగమ ప్రాంతాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు త్రివేణి సంగమాలు ఉన్నయి. ఒకటి నిజామాబాద్ జిల్లా బాదనకుర్తి వద్ద, మరొకటి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద, మరొకటి ఆంద్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. తెలంగాణాలో ఉన్న కాళేశ్వరం క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్షేత్రాన్ని ప్రయాగ్‌రాజ్‌తో పోలుస్తారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే ప్రయాగ్‌రాజ్‌లో చేసినంత పుణ్యఫలం వస్తుందని విశ్వసిస్తారు. అందుకే ప్రయాగ్‌రాజ్ వెళ్లలేని తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు కాళేశ్వరం వస్తుంటారు. ఇక్కడ ముక్తీశ్వరుడు(పరమేశ్వరుడు), కాలేశ్వరుడు(యమధర్మరాజు) ఒకే పానవట్టంపై కొలువుదీరి కనిపిస్తారు. ఈ కారణంగా కూడా ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
మూడు నదుల సంగమం..
ఇక కాళేశ్వరంలో మూడు నదులు కలుస్తాయి. మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టిన గోదావరి కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తుంది. ఈ నదిలోకి మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది కలుస్తుంది. ఈ రెండు నదులు కలయిక దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నీరు కలిసే ప్రదేశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ప్రయాగ్‌రాజ్‌లో భావిస్తున్నట్లుగానే.. ఇక్కడ కూడా మూడో నది సరస్వతి నది అంతర్వాహిణిగా ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. రాజస్తాన్‌లో ఉన్న ఈ సరస్వతి నది తర్వాత అంతర్వామిణిగా మారిందని భావిస్తారు. ఇది ప్రయాగరాజ్, కాలేశ్వరంలో అంతర్వాహినిగా కలుస్తుందని పేర్కొంటారు.
రెండు నదులు మహారాష్ట్ర నుంచే..
ఇదిలా ఉంటే.. కాళేశ్వరం వద్ద కలిసే రెండు నదులు మహారాష్ట్రలోనే ఆవిర్భవించాయి. దిగువన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని కలయిక ఉండడంతో త్రివేణి సంగమంగా పిలుస్తారు.