Gannavaram Constituency YCP in-charge : కీలక నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ చేశారు. అందులో భాగంగా కీలకమైన గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే గుడివాడ కంటే గన్నవరంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి వల్లభనేని వంశీమోహన్ గత 100 రోజులుగా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం సైతం క్షీణించింది. కోర్టు ప్రత్యేక వైద్య అందించాలని ఆదేశించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరుసగా కేసులు నమోదవుతుండడం.. వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో గన్నవరం నియోజకవర్గ బాధ్యతలను వెరొకరికి అప్పగించాలని జగన్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read : దేశంలో టాప్ పర్సనాలటీస్ : జగన్, పవన్ లలో ఎవరికి ఎక్కువ ఆదరణ అంటే?
తెలుగుదేశం పార్టీకి కంచుకోట..
గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. వైసీపీ ఆవిర్భావం తరువాత మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ ఓటమి చవిచూసింది. 2014లో తొలిసారిగా గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేశారు వల్లభనేని వంశీమోహన్. ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2019లో రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు వంశీ. జగన్ ప్రభంజనంలో సైతం విజయం సాధించారు. అయితే కొద్దిరోజులకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అయితే అప్పటికే 2014 ఇదే వంశీపై పొటీచేసిన దుట్టా రామచంద్రరావు, 2109లో పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే వారిద్దర్నీ కాదని.. వైసీపీలోకి ఫిరాయించిన వంశీకి ప్రాధాన్యం ఇచ్చారు జగన్. దీంతో టీడీపీలో చేరిన యార్గగడ్ల వెంకటరావు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి వంశీపై గెలుపొంది రికార్డు సాధించారు.
గత 100రోజులుగా రిమాండ్ ఖైదీగా..
అయితే ఎన్నికల ఫలితాల ప్రకటన నుంచి వల్లభనేని వంశీమోహన్ గన్నవరం నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. ఆయన అమెరికా వెళ్లిపోతారని ప్రచారం నడిచింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏపీ పోలీసులు హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేశారు. అది మొదలు కేసుల మీద కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గన్నవరంలో పార్టీ బాధ్యతలను దుట్టా రామచంద్రరావుతో పాటు ఆయన కుటుంబసభ్యలు చూస్తున్నారు. ముఖ్యంగా దుట్టా రామచంద్రరావు కుమార్తెకు వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా రేపు వంశీ భార్య పంకజాశ్రీతో కలిసి గన్నవరం పార్టీ సమావేశం నిర్వహించాలని మాజీ మంత్రి పేర్ని నానిని ఆదేశించడం విశేషం.
ముగ్గురు మధ్య పోటీ..
వాస్తవానికి గన్నవరం నియోజకవర్గంలో కొత్త వ్యక్తికి వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీకి మొన్న ఎన్నికల్లో పోటీచేయడం ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఫలితాల తరువాత కూడా వంశీ నియోజకవర్గం వైపు చూడడం మానేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో షర్మిళను విభేదించే మహిళా నేత సుంకర పద్మశ్రీని తెప్పించి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు దుట్టా రామచంద్రరావు కుమార్తె పేరు ఖారారు చేసినట్టు టాక్ నడిచింది. కానీ ఇప్పుడు వంశీ భార్య పంకజాశ్రీ పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రేపు పార్టీ శ్రేణుల అభిప్రాయం తీసుకొని ఒక నిర్ణయానికి రానున్నారు.