YS Jagan Leadership : జగన్ వైఖరిలో మార్పు రావడం లేదా? ఇంకా పాత భ్రమల్లోనే ఉన్నారా? ఓటమి నుంచి గుణపాఠాలు నేర్వలేదా? ప్రతిపక్ష నేతగా దూకుడు ప్రదర్శించడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అదే మాట వినవస్తోంది. ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. వైనాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. అయితే ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ అసెంబ్లీకి హాజరుకావడం లేదు జగన్మోహన్ రెడ్డి. మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు వెళుతున్నారు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి వైఖరిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మేథావులు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అప్పట్లో చంద్రబాబు అసెంబ్లీకి హాజరైన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా సభలో కూర్చొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో సహేతుకమైన కారణాన్ని చూపి అసెంబ్లీని బాయ్ కట్ చేశారు. కానీ జగన్ ప్రారంభం నుంచి బాయ్ కట్ చేయడంపై మాత్రం అనేక రకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : గన్నవరం బాధ్యతలు ఆ నేతకు.. జగన్ సంచలన నిర్ణయం
ధైర్యం నింపే ప్రయత్నం..
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. అది ఊహించినది కూడా. దీంతో పార్టీకి భవిష్యత్ లేదని భావించిన చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. పార్టీలో నంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు సైతం దూరమయ్యారు. మరోవైపు కేసులు చుట్టుముడుతున్నాయి. ఇటువంటి సంక్లిష్ట సమయంలో ధైర్యం పోగుచేసుకొని బయటకు వచ్చారు. ఓటమి నుంచి తేరుకొని నాయకుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయితే అంతవరకూ ఓకే కానీ..ఈ తెగువ చాలదని.. ఇంతకు మించి అన్నట్టు వ్యవహరించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2014 నుంచి 2019 మధ్య చూపిన దూకుడు కనబరచాలని సూచిస్తున్నారు. అయితే అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు అన్నట్టు ఉంది పరిస్థితి. అప్పట్లా జగన్ వెంట నిలిచే జనం లేరు. ఆపై పార్టీ శ్రేణులు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు.
మారిన వైఖరి..
అయితే జగన్మోహన్ రెడ్డి చాలావరకూ దూకుడు ప్రకటనలు అయితే చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి నాలుగు గంటల పాటు మాట్లాడారు. మద్యం కుంభకోణంలో అసలు ఏం జరిగింది? ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎండగట్టే ప్రయత్నం చేశారు. అయితే తన అరెస్టు ఉంటుందన్న అనుమానాల నేపథ్యంలోనే ఆయన మీడియా ముందుకు వచ్చారన్న విమర్శలున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చారు. మండలాల నుంచి రాష్ట్రస్థాయి వరకూ నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. అయితే ఇలా ఆదేశాలు కాకుండా ఆయనే నేరుగా రంగంలోకి దిగి దూకుడు కనబరచాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కానీ అంతటి సాహసం జగన్ చేస్తారా? అన్న అనుమానం వెంటాడుతోంది.
జిల్లాల పర్యటనెప్పుడు?
అప్పుడెప్పుడో సంక్రాంతి తరువాత జనంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. ఇది జరిగి ఆరు నెలలు అవుతోంది. కానీ ఎప్పుడోస్తారో తెలియడం లేదు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారం రోజుల్లో నాలుగు రోజుల పాటు బస చేస్తానన్నారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. 2027లో పాదయాత్ర ఉంటుందని కూడా ప్రకటించారు. జగన్ 2.0 చూడబోతున్నారని కూడా చెప్పుకొచ్చారు. కానీ దానిపైనా పార్టీ శ్రేణులకు ఆసక్తి తగ్గింది. ముందుగా ప్రజల్లోకి వచ్చి దూకుడు కనబరుస్తేనే జగన్ పై నమ్మకం కుదిరే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం కష్టమే..