Kavuri Sambasiva Rao passes away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థతతో బాధపడ్డారు. ఈనెల 7న ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆసుపత్రిలో కావూరి సాంబశివరావు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు కావూరి సాంబశివరావు. అయితే నిన్న రోజంతా కావూరి సాంబశివరావు మృతి చెందినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ధ్రువీకరించే వరకు ఎటువంటి ప్రచారం చేయవద్దని కోరారు. రాత్రికి మృతి చెందేసరికి కుటుంబ సభ్యులు ధ్రువీకరిస్తూ ప్రకటన జారీ చేశారు.
అంచెలంచెలుగా ఎదిగి
సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు కావూరి సాంబశివరావు. 1943 అక్టోబర్ 2 న జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. వ్యాపారాల్లో సైతం రాణించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1984, 1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం నుండి గెలిచారు కావూరి సాంబశివరావు. 2004, 2009 ఎన్నికల్లో మాత్రం ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీచిన సమయంలో సైతం తనదైన ఉనికి చాటుకున్నారు కావూరి. 2014 రాష్ట్ర విభజనతో బిజెపిలో చేరారు. అటు తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.
Also Read: విశాఖ గూగుల్ డేటా సెంటర్.. కోర్టుకు వైసిపి!
నందమూరి కుటుంబంతో బంధుత్వం..
విశాఖ మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి కుటుంబంతో బంధుత్వం ఉంది కావూరి సాంబశివరావుకు. ప్రస్తుత విశాఖ ఎంపీ శ్రీ భరత్ కు కావూరి సాంబశివరావు పాత అవుతారు. శ్రీ భరత్ తల్లి సాంబశివరావు కుమార్తె. అందుకే నందమూరి,నారా కుటుంబ సభ్యులు కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం నారా లోకేష్ ప్రత్యేక సంతాపం తెలిపారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఘన నివాళులు అర్పించారు.