MLC  Election  : విశాఖలో వన్స్ మోర్.. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఫిక్స్.. గెలిచేదెవరు?

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. సంఖ్యాపరంగా వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. కానీ అనూహ్యంగా టిడిపి కూటమి అభ్యర్థిని బరిలో దించుతోంది. దీంతో హోరాహోరీ ఫైట్ తప్పేలా లేదు.

Written By: Dharma, Updated On : August 7, 2024 12:22 pm
Follow us on

MLC  Election :  ఏపీలో మరో పోరుకు తెరలేచింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరగనుంది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలోకి ఫిరాయించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది. అందుకే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. వైసిపికి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. స్థానికంగా బలమైన నేతలు ఉన్నా.. వారందరినీ కాదని పక్క జిల్లాకు చెందిన బొత్స ఎంపిక వెనుక వ్యూహం ఉంది. బలమైన సామాజిక వర్గం తో పాటు ఆర్థికంగా గట్టి పట్టు ఉన్న నేత బొత్స. ఆయన జిల్లా కే కాకుండా రాష్ట్ర స్థాయి నేతగా కూడా గుర్తింపు పొందారు. ఆయన అయితే వివిధ సమీకరణల దృష్ట్యా నెగ్గుకు రాగలరని జగన్ భావించారు.అందుకే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కూటమి అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అన్న డిఫెన్స్ కొనసాగింది. కానీ అందరి అంచనాలను తెర దించుతూ కూటమి తన అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖ నగరపాలక సంస్థకు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మరి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులను పెద్ద ఎత్తున టిడిపి కూటమి పార్టీలోకి చేర్పించే ఆపరేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తద్వారా టిడిపి కూటమి తరుపున తప్పకుండా అభ్యర్థిని నిలబెడతారని స్పష్టమైంది. అయితే ఈ విషయంలో వైసిపి ముందుగానే అలెర్ట్ అయ్యింది. రెండు రోజులపాటు విశాఖ నేతలతో జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

* అప్పట్లో పోటీ లేకుండానే
వైసిపి హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. అప్పట్లో వైసీపీకి ఏకపక్షంగా మెజారిటీ ఉండడంతో టిడిపి పోటీ పెట్టలేదు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు అదే బలం వైసీపీకి ఉన్నా.. ఇటీవల ఘోర పరాజయం ఎదురు కావడంతో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. అందుకే ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. గట్టి అభ్యర్థి అవుతారని భావించి బొత్స సత్యనారాయణ ను ఎంపిక చేసింది. ఈరోజు నుంచి రెండు రోజులపాటు వరుసుగా విశాఖ పార్టీ నేతలతో జగన్ ఎమ్మెల్సీ ఎన్నిక వ్యూహంపై చర్చిస్తారు. సలహాలు సూచనలు అందించనున్నారు.

* కూటమి అభ్యర్థి ఆయనే
అయితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని టిడిపి కూటమి భావిస్తోంది. విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తోంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిడిపి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గోవింద సత్యనారాయణ 2014 నుంచి 2019 మధ్య అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అందుకే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు సమాచారం. ఈయన సైతం పట్టున్న నేత. ఆపై ఆర్థికంగా బలవంతుడు అని తెలుస్తోంది.

* కీలక నేతలకు బాధ్యతలు
స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల్లో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో వైసిపి నాయకత్వం ముందే జాగ్రత్త పడుతోంది. పోలింగ్ వరకు శిబిరం కొనసాగేలా నిర్ణయం తీసుకుంది. మాజీమంత్రులు కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, అంబటి రాంబాబులను రంగంలోకి దించింది. వారికి స్థానిక ప్రజాప్రతినిధులు చేజారకుండా చూసే బాధ్యతను అప్పగించారు. తెలుగుదేశం పార్టీ సైతం ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను మంత్రులు అచ్చెనాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విశాఖ వేదికగా మరోసారి గట్టి యుద్ధమే జరగనుంది.