Telugu News » Andhra Pradesh » It seems that chandrababu tv 5 chief br naidus name has been finalized for the post of ttd chairman
TTD Chairman : సీనియర్లకు చంద్రబాబు షాక్.. ఆ మీడియా అధిపతికే టిటిడి చైర్మన్ పదవి!
ఈ ఎన్నికల్లో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మూడు పార్టీల పొత్తుతో అనూహ్య విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్లకు పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు. అటువంటివారు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
TTD Chairman : ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో టీటీడీ చైర్మన్ కీలకం.మంత్రితో సమానమైన పదవి ఇది.అందుకే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అస్మదీయులకు ఈ పదవి కేటాయిస్తారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇద్దరికీ మాత్రమే ఛాన్స్ ఇచ్చింది.తొలివిడతగా జగన్ సమీప బంధువు, బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కి అవకాశం ఇచ్చారు. చివరి ఏడాది మాత్రం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఛాన్స్ కల్పించారు. రకరకాల పేర్లు తెరపైకి వచ్చిన సొంత సామాజిక వర్గం నేతలకే ఛాన్స్ ఇచ్చారు జగన్. తీవ్ర విమర్శలు వ్యక్తమైనా ఆయన మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని రకాల సమీకరణలను పరిగణలోకి తీసుకొని టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని చూస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కావడంతో మూడు పార్టీల ఏకాభిప్రాయం కూడా అవసరం. వీలైనంత త్వరగా పెండింగ్ పదవులు భర్తీ చేయాలని చూస్తున్న చంద్రబాబు.. పవన్ తో కీలక చర్చలు జరుపుతున్నారు.ఒకటి రెండు రోజుల్లో టిటిడి చైర్మన్ పదవి ఖరారు చేయనున్నారు.ప్రధానంగా ఒక మీడియా సంస్థల అధినేత పేరు ఖరారు చేసినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా టిడిపికి మద్దతుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నిలిచింది. వైసీపీ సర్కార్ ఎన్ని రకాల ఒత్తిడి చేసినా.. ఆ మీడియా మాత్రం చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంది.ఇప్పుడు అందులో ఒక మీడియా అధినేతకు టీటీడీ చైర్మన్ పదవి ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు పవన్ సైతం అంగీకరించినట్లు సమాచారం.
* నాగబాబు విముఖత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిటిడి చైర్మన్ పదవికి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో మెగా బ్రదర్ నాగబాబు చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మెగా కుటుంబానికి తిరుపతి తో మంచి అనుబంధం ఉంది.అందుకే మెగాస్టార్ చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పవన్ సైతం అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పిఠాపురం నుంచి బరిలో దిగారు.అయితే టీటీడీ పదవి నాగబాబుకు ఇస్తే సముచిత స్థానం ఇచ్చి గౌరవం ఇచ్చినట్టు ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ నాగబాబు పెద్దగా మొగ్గు చూపలేదని తెలుస్తోంది.
* అశోక్ గజపతిరాజు తెరపైకి
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు ప్రధానంగా వినిపించింది. ఆయన విజయనగరం రాజవంశీయుడు. ఆపై మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్. ఉత్తరాంధ్రలో దేవస్థానాలకు అనువంశిక ధర్మకర్తగా కూడా ఉన్నారు. వైసీపీ హయాంలో అశోక్ గజపతిరాజును జగన్ టార్గెట్ చేసుకున్నారు. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు అశోక్ గుడ్ బై చెప్పారు. అటువంటి నేతకు టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపించింది. అయితే గవర్నర్ గిరికి ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
* బి ఆర్ నాయుడు వైపు మొగ్గు
మరోవైపు సినీ పరిశ్రమ నుంచి మాజీ ఎంపీ మురళీమోహన్ పేరు ప్రధానంగా వినిపించింది. తెలుగుదేశం పార్టీలో ఆయన సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లోరాజమండ్రి నుండి పోటీ చేసి గెలిచారు.2019లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన కోడలు పోటీ చేశారు. ఎన్నికల్లో మాత్రం ఆ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయలేదు. అయితే టీటీడీ చైర్మన్ పదవితో సంతృప్తికరంగా ముగించేస్తానని మురళీమోహన్ చంద్రబాబును వేడుకున్నట్లు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబు టీవీ 5 అధినేత బి ఆర్ నాయుడు పేరును టీటీడీ చైర్మన్ పదవికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి సర్కార్ నుంచి ఇబ్బందులు పడినా.. టిడిపికి అండగా నిలిచిన టీవీ5 యాజమాన్యానికి కృతజ్ఞతగా ఆ పదవి కేటాయించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.