IND vs SL 3 ODI : శ్రీలంకతో టి20 సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా.. ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి వన్డే టై అయింది. రెండవ వన్డే లో ఓటమిపాలైంది. దీంతో భారత్ చేతిలో నుంచి సిరీస్ తప్పిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే మూడో మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. గెలిస్తేనే రోహిత్ సేనకు పరువు దక్కుతుంది. లేకుంటే శ్రీలంక టి20 సిరీస్ లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్టవుతుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలి అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా జట్టుకు భారమైన ఆటగాళ్లను దూరం పెట్టాల్సి ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. కచ్చితంగా జట్టులో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ కు ఉద్వాసన పలకాల్సిందేనని సీనియర్ ఆటగాళ్లు అంటున్నారు. కేఎల్ రాహుల్ రెండవ వన్డేలో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. అభిమానుల ఆశలు నిరాశ చేస్తూ పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి రాహుల్ కనుక మెరుగైన ఇన్నింగ్స్ ఆడి ఉంటే భారత జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది.
కేఎల్ రాహుల్ మొదటి వన్డేలో 31 రన్స్ చేశాడు. రెండవ వన్డేలో గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. వాస్తవానికి రాహుల్ చాలా కాలం తర్వాత జట్టులోకి పునరాగమనం చేశాడు. ఐపీఎల్ లో ఆశించినంత స్థాయిలో అతడు ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతనికి టి20 వరల్డ్ కప్ లో అవకాశం లభించలేదు. శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ కి అతనికి ఎంట్రీ దొరకలేదు. వన్డే సిరీస్ లో మాత్రం అతడికి అవకాశం లభించింది. మొదటి వన్డేలో 31 రన్స్ చేసిన అతడు, రెండవ వన్డేలో 0 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతడిని మూడవ వన్డే నుంచి తప్పించాలని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. శివం దుబే కూడా రెండవ వన్డేలో సున్నా పరుగులకే అవుట్ కావడంతో.. అతడి స్థానంలో రియాన్ పరాగ్ ను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ ను కూడా పక్కనపెట్టి అతడి స్థానంలో మరో ఆటగాడికి అవకాశం కల్పించాలని సీనియర్ క్రికెటర్లు కోరుతున్నారు.
కేఎల్ రాహుల్ స్థానంలో స్థిరంగా ఆడగలిగే బ్యాటర్ కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు కోరుతున్నారు.” అతడు స్పిన్ బౌలింగ్ లో తడబడుతున్నాడు. మెరుగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. మిడిల్ ఆర్డర్ అంటే జట్టుకు వెన్నెముకలాగా ఉండాలి. రోహిత్ మెరుగైన ఆరంభాలు ఇస్తున్నప్పటికీ.. వాటికి స్థిరత్వం తీసుకురావడంలో రాహుల్ విఫలమవుతున్నాడు. మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్నప్పటికీ రాహుల్ నిలబడాల్సి ఉండేది. కానీ అతడు కూడా తడబడుతున్నాడు. అంతటి సీనియర్ ఆటగాడు రెండవ వన్డేలో 0 పరుగులకు అవుట్ కావడం నిరాశ కలిగించింది. అతడు గనుక ఆడి ఉంటే బాగుండేదని” మాజీ క్రికెటర్లు అంటున్నారు. రాహుల్ వల్ల రిషబ్ పంత్ ను జట్టుకు దూరం చేశారు. అతడిని గనుక ఆడించి ఉంటే భారత్ కచ్చితంగా సిరీస్ గెలిచి ఉండేదని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు తొలి వన్డే టై కాగా, రెండవ వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓడిపోయింది.. సిరీస్ 1-0 తో వెనుకబడిపోయింది.