RK Roja: ఏపీ ( Andhra Pradesh)రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర సంపాదించుకున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. కానీ ఇటీవల ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. తాడేపల్లి వైపు కూడా రావడం మానేశారు. సొంత నియోజకవర్గ నగరిలో అప్పుడప్పుడు హడావిడి చేస్తున్నారు. రికార్డింగ్ వీడియోలను మీడియాకు విడుదల చేసి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అది కూడా ఏదో ఒక ప్రత్యేక సందర్భంలోనే. అయితే రాజకీయాలను క్రమేపి విడిచి పెట్టాలన్న ఆలోచనలో రోజా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు నాట ఉండకుండా.. తమిళనాడులో సెటిలై పోవాలన్న ఆలోచనలో ఆమె ఉన్నట్లు సమాచారం. తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు గట్టి అవకాశాల కోసం రోజా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
* ఆమె స్థానంలో శ్యామల..
మాజీ మంత్రి రోజా( RK Roja) ఇటీవల మీడియాలో కూడా కనిపించడం లేదు. అయితే వైసిపి నాయకత్వం ఆమెను వద్దనుకుందా? లేకుంటే ఆమె బయటకు వెళ్లిపోయిందా అన్నది తెలియడం లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే రోజా లాంటి నేతలు ఉంటే తాము పార్టీలో ఉండలేమని కొంతమంది వైసీపీ సీనియర్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే వెనువెంటనే శ్యామలాన్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని చేసినట్లు ప్రచారం సాగుతోంది. కేవలం రోజాకు మాత్రం అవసరమైన సమయంలో కంటెంట్ పంపించి మాట్లాడిస్తున్నట్లు సమాచారం. అయితే పొమ్మనలేక ఆమెను పొగ పెట్టినట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రోజా సైతం ఈ సమీక్షలకు హాజరు కావడం లేదు. తాడేపల్లి వైసిపి కేంద్ర కార్యాలయంలో కూడా పెద్దగా కనిపించడం లేదు.
* ఒక వెలుగు వెలిగిన వైనం..
తెలుగు చిత్ర పరిశ్రమతో( Telugu cinema industry) పాటు బుల్లితెరపై ఒక వెలుగు వెలిగారు రోజా. కానీ రాజకీయాల్లో దూకుడు తనం ప్రదర్శించి హుందాతనాన్ని పోగొట్టుకున్నారు. దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరైన అవకాశాలు దక్కడం లేదు. అందుకే తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా లెనిన్ పాండియన్ అనే సినిమాలో రోజా నటిస్తున్నట్లు సమాచారం. అందులో వృద్ధురాలిగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర సక్సెస్ అయితే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. హీరోయిన్గా తమిళనాడులో ఒక ఊపు ఊపారు రోజా. కానీ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయాల్లో ప్రవేశించి రాణించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆమె గుర్తించినట్లు సమాచారం. ఆమె వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్న వారు కూడా ఉన్నారు. అందుకే సొంత పార్టీలో ప్రత్యర్థులను ఎదుర్కోలేక.. కూటమి దూకుడు తట్టుకోలేక ఏపీ రాజకీయాలను విడిచి పెడుతున్నట్లు తెలుస్తోంది.
* అవినీతి కేసుల భయంతో..
కూటమి ప్రభుత్వం రోజా విషయంలో దూకుడుగా ఉన్నట్లు ప్రచారం సాగింది. వైసిపి హయాంలో ఆమె క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా భారీగా అవినీతి జరిగిందన్నది కూటమి ప్రభుత్వం ఆరోపణ. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ సాగింది. ఆ విచారణ నివేదిక ప్రభుత్వానికి వచ్చింది. రోజా అరెస్టు ఖాయమని ప్రచారం సాగింది. అది మొదలు రోజా ఏపీలో కనిపించకుండా మానేశారు. ఆపై తమిళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు దక్కుతుండడంతో.. ఇక రాజకీయాలకు రోజా దూరమవుతారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.