Sajjala Ramakrishna Reddy: ఏ పార్టీలోనైనా నాయకత్వం బలహీన పడితే తిరుగుబాటు ఖాయం. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలకు సైతం ఈ ఇబ్బంది తప్పలేదు. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి సైతం ఇదే తరహా ఇబ్బంది ఎదురు కానుంది అని తెలుస్తోంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటారు అన్నది ప్రశ్న. అయితే చాటుక్కున భారతి రెడ్డి పేరు చెబుతారు కానీ.. ఆమె కాకుండా ఎవరు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఒకవేళ సాహసించి చెప్పాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పార్టీ పగ్గాలు తీసుకోవడానికి జగన్ తర్వాత ఎవరూ లేరు కూడా. విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతకుముందే గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందే చెల్లెలు షర్మిల దూరమయ్యారు. ఎన్నికల అనంతరం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి దగ్గరకు రావడం లేదు. ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
* జగన్ బలహీనతలను గుర్తించి..
ఎవరైనా తన మనస్తత్వాన్ని గుర్తించి మాట్లాడిన వారిని ఆదరిస్తారు. ఆ విద్య సజ్జల రామకృష్ణారెడ్డికి( sajjala Ramakrishna Reddy ) ఇట్టే తెలిసిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆయన కు ఇష్టపడేలా కొన్ని పనులు చేయించి దగ్గరయ్యారు. ఇప్పుడు కూడా అంతా ఆల్ రైట్.. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దే విజయం అని నమ్మబలుకుతున్నారు. తనకు ఇష్టమైన భజన కావడంతో జగన్మోహన్ రెడ్డి సైతం ఎంతో ఆనందంతో ఉన్నారు. అందుకే భజనపరులు తో చాలా ప్రమాదమని సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల హెచ్చరించారు కూడా. అది సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించింది అని ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* అంతా ప్లాన్ ప్రకారం?
సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నట్లు అర్థం అవుతోంది . జగన్ పార్టీ పెట్టకముందు.. కాంగ్రెస్ పార్టీలో అవినీతి కేసులు ఎదుర్కొన్న సమయంలోనే అండగా నిలబడ్డారు విజయసాయిరెడ్డి. జగన్ తో పాటు 16 నెలల జైలు జీవితం కూడా అనుభవించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, పార్టీని అధికారంలోకి తీసుకురావడం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. అటువంటి విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం వెనుక సజ్జల పాత్ర ఉందనేది ప్రధాన ఆరోపణ. ఒక్క విజయసాయి రెడ్డి కాదు.. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నేతలు గుడ్ బై చెప్పడం వెనుక సజ్జల ఉన్నారన్నది ఒక ప్రధానమైన విమర్శ కూడా.
* పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ పట్టు..
సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వంతో పాటు ఆ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక సామాన్య నేతగా ప్రవేశించి సకల శాఖలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. పార్టీలో కీలక విభాగంగా ఉన్న సోషల్ మీడియా బాధ్యతలను తన కుమారుడు భార్గవ రెడ్డికి అప్పగించారు. కానీ ఐదేళ్లపాటు ఆ బాధ్యతల్లో ఉన్న భార్గవరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఎంత మాత్రం భాగస్వామ్యం కాలేకపోయారన్న విమర్శ ఉంది. ఇప్పుడు అదే భార్గవరెడ్డిని సాక్షి మీడియాలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే జగన్ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు అంటే మాత్రం సజ్జల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వారానికి మూడు రోజులు తాడేపల్లిలో గడిపి నాలుగు రోజులు బెంగుళూరులో ఉండి పోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో పార్టీని నడిపే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డి అనధికారిక వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నమాట.