Jagan Banglore Tour: జగన్ చర్యలు వైసీపీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. ఆయన పట్టుమని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉండడం లేదు. తరచూ బెంగుళూరు వెళ్లిపోతున్నారు. ఆ పర్యటనలకు సంబంధించి షెడ్యూల్ సైతం బయటకు రావడం లేదు. అక్కడకు ఏం పని మీద వెళ్తున్నారో కూడా చెప్పడం లేదు. గత 40 రోజుల్లో నాలుగు సార్లు బెంగళూరు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.ఈ తరుణంలో స్పీకర్ఎంపికకు కూడా జగన్ హాజరు కాలేదు. అదేరోజు బెంగళూరు వెళ్ళిపోయారు. సాధారణంగా స్పీకర్ ఎంపికలో ప్రతిపక్షానిదే కీలక పాత్ర. కానీ స్పీకర్ గా ఎంపికైన అయ్యన్నపాత్రుడు వైసీపీని ఉద్దేశించి దారుణంగా మాట్లాడారంటూ ఆక్షేపిస్తూ అదేరోజు బెంగళూరు వెళ్ళిపోయారు జగన్. అదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలని కోరుతూ లేఖ రాశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పులివెందుల వెళ్లారు జగన్. అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ నలభై రోజుల వ్యవధిలో నాలుగు సార్లు బెంగళూరు వెళ్లడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇందులో పొలిటికల్ అజెండా ఏదైనా దాగి ఉందా? అని సొంత పార్టీ శ్రేణులే అనుమానించే దాకా పరిస్థితి వచ్చింది. రకరకాల కారణాలు చెబుతూ ఇప్పటివరకు జగన్ బెంగళూరు బాట పట్టారు. ఇప్పుడు మాత్రం కారణం చెప్పకుండానే వెళ్తున్నారు. దీనిపై రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి.
* ఇలా వచ్చి.. అలా వెళ్తున్న జగన్
ఇటీవలే బెంగళూరు నుంచి తాడేపల్లి కి వచ్చారు జగన్. పాస్ పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని చెప్పి వచ్చారు. ఆ పని అయిపోయిన వెంటనే తిరిగి బెంగళూరు పయనమయ్యారు. బెంగళూరులో జగన్ కు ప్యాలెస్ ఉంది. యలహంక ప్రాంతంలో భారీ భవంతిని నిర్మించారు. బెంగళూరు వెళ్తే అక్కడే బస చేస్తున్నారు. కానీ అక్కడ జగన్ ఎవరిని కలుస్తున్నారు? ఏం చర్చలు జరుపుతున్నారు? అన్నది మాత్రం బయటకు చెప్పడం లేదు.
* పొలిటికల్ అజెండా తోనే..
అయితే జగన్ బెంగుళూరు వెళుతున్నది పక్కా పొలిటికల్ అజెండా తోనే అని ప్రచారం అయితే జరుగుతోంది. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తన సన్నిహితుడైన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన ద్వారా కొన్ని విషయాల్లో లాబీయింగ్ చేసుకునేందుకే జగన్ తరచూ బెంగళూరు వెళుతున్నారని ప్రచారం మాత్రం జరుగుతోంది. అయితే దీనిపై డీకే శివకుమార్ ప్రత్యేక ప్రకటన చేయాల్సి వచ్చింది. తనను ఇంతవరకు జగన్ కలవలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలకు దిగుతామని కూడా హెచ్చరించారు. దీంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
* అదే అనుమానం
జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న ఢిల్లీలో జరిగిన ధర్నాకు కాంగ్రెస్ మినహాయించి అన్ని ఇండియా కూటమి పార్టీలు హాజరయ్యాయి. అటు కాంగ్రెస్ కు సైతం జగన్ దగ్గర అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ కాకుండా కర్ణాటకకే జగన్ క్యూ కట్టడం కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సన్నిహితుడు అన్న ముద్ర ఉంది. అందుకే జగన్ బెంగళూరు నగరాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More