Pulasa Fish: “పులస కోసం పుస్తెలు కూడా తాకట్టు పెడతారు” ఈ సామెత గోదావరేతర జిల్లాల వారికి కాస్త అతిశయోక్తి లాగా అనిపిస్తుంది. పులస కోసం మైళ్ళ దూరమైనా గోదావరి జిల్లాల వాసులు వెళ్తారు. పులస పులుసు కోసం ఎంతటి ఇబ్బందులైనా పడతారు. ఏడాదిలో.. ముఖ్యంగా వానలు కురిసే సమయంలో పులస ముక్కను తినాలని.. పులస పులుసును జుర్రు కోవాలని అనుకుంటారు. దానికోసం ఎంత ఖర్చయినా చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. మెండుగానే వర్షాలు కురుస్తున్నాయి. కొత్తనీటితో నదులన్నీ ఎర్రగా కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాలు ఏమోగానీ.. గోదావరి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎర్ర నీరు వచ్చి చేరిందంటే పులస వలకు చిక్కినట్టే.. అయితే ఈసారి వర్షాలు కాస్త ఆలస్యం కావడంతో గోదావరి జిల్లాల మత్స్యకారులు డీలా పడిపోయారు. ఆలస్యమైనప్పటికీ.. వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో.. మత్స్యకారుల వలలకు పులసలు చిక్కుతున్నాయి.. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అప్పన రాముని లంక గోదావరిలో మత్స్యకారులకు పులస చేప చిక్కింది. గోదావరి జిల్లాల్లో ఆషాడం అల్లుళ్లకు, బంధువులకు పులస చేపలతో విందు ఇవ్వడం ఒక ఆనవాయితీ.
గత 15 రోజులుగా గోదావరి ఎగవ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నీరు పూర్తిగా రంగు మారింది. ఎప్పుడైతే నీరు రంగు మారిందో ఎప్పుడైతే నీరు రంగు మారిందో మత్స్యకారులు వలలతో వేటకు వెళ్ళిపోయారు. గోదావరి మత్స్యకారుల కష్టాన్ని చూసి చలించిపోయినట్టుంది.. అందుకే వారికి ఆనందాన్ని ఇవ్వాలని పులసను వారి వలలకు చిక్కేలా చేసింది. దీంతో ఆ మత్స్యకారుల ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. అప్పన రాముని లంక గోదావరిలో ఓ మత్స్యకారుడి వాళ్లకు పులస చిక్కింది. ఈ చేప భారీ ధర పలికింది. ఆ అనుకున్నట్టుగానే రికార్డ్ స్థాయిలో ఆ మత్స్యకారుడికి లాభం దక్కింది. కేజీన్నర బరువు ఉన్న పులస చేపను అప్పన రాముని లంక మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000 కొనుగోలు చేశారు.. పోటాపోటీ మధ్య ఆయన ఆ ధరకు దక్కించుకున్నారు. చేపను సొంతం చేసుకున్న అనంతరం శ్రీను ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో ఫోన్లో చెప్పారు. బంధువులతో కూడా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ చేప అమోఘమైన రుచిని కలిగి ఉంటుంది. ఏడాదిలో ముఖ్యంగా కొత్తనీరు వచ్చే సమయంలో ఎక్కువగా లభిస్తుంది.
కొత్తనీరు చేరడం వల్ల ఈ చేపలు గోదావరికి ఎదురెక్కుతాయి. కొత్త నీటిని తాగడం వల్ల వీటి శరీరం రంగు మారుతుంది. అంతేకాదు ప్రత్యేకమైన ఖనిజలవణాలను శోషించుకోవడం వల్ల ఆ చేప ప్రత్యేక లక్షణాలను సంతరించుకుంటుంది. దానిని తినడం వల్ల శరీరానికి మెండుగా పోషకాలు లభ్యమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చింతపండు, కాస్త పచ్చి మామిడికాయలను జత చేసి పులుసు పెడితే.. అమోఘమైన రుచి లభిస్తుంది. అందుకోసమే గోదావరి జిల్లా వాళ్లు పులస చేప అంటే ఎగబడతారు. పూర్వపు రోజుల్లో తమకు ఏవైనా కార్యాలయంలో పనులు కావాలంటే సంబంధిత అధికారులకు పులస చేపలను పంపించేవారు. ఇంకొందరైతే పులస చేపలను పచ్చడి పెట్టించి ఇచ్చేవారట. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమ వలలకు పులస చేపలు మరిన్ని చిక్కుతాయి అంటూ మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.