Homeక్రైమ్‌Kathua Terror Attack: బెదిరించారు.. తుపాకీ ఎక్కు పెట్టారు.. కటువా ఘటనలో వెలుగులోకి ఉగ్రవాదుల ఘాతుకాలు

Kathua Terror Attack: బెదిరించారు.. తుపాకీ ఎక్కు పెట్టారు.. కటువా ఘటనలో వెలుగులోకి ఉగ్రవాదుల ఘాతుకాలు

Kathua Terror Attack: “సైనిక వాహనంపై మెరుపు దాడి చేశారు. ఐదుగురు సైనికుల ప్రాణాలను బలిగొన్నారు..” నిన్నటి వరకు జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కటువా ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఈ విషయాలు మాత్రమే తెలుసు. అయితే ఆ ఘటనలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఘటనకు ముందు ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడినట్టు జాతీయ మీడియా పరిశీలనలో స్థానికులు చెప్పడం సంచలనం కలిగిస్తోంది..” కొంతమంది తుపాకులు ధరించిన వ్యక్తులు మా ఇళ్లల్లోకి వచ్చారు. తుపాకులు చూపి బెదిరించారు. చికెన్ తెచ్చి వండమన్నారు. పది నుంచి 15 మందికి సరిపడే ఆహారాన్ని తయారు చేయమని డిమాండ్ చేశారని” స్థానికులు చెప్పడం కలకలం కలిగిస్తోంది.

ఇదే సమయంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని, ఆహారం ఉండాలని ఓ వ్యక్తికి అప్పగించిన మహిళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ఈనెల 8న జరిగింది. దాడి జరిపిన సమయంలో ఉగ్రవాదులు వారి శరీరాలకు ప్రత్యేకమైన కెమెరాలను ధరించారు. భద్రతా బలగాల సభ్యులు చనిపోయిన తర్వాత.. వారి వద్ద నుంచి ఆయుధాలను దొంగిలించేందుకు ప్రయత్నించారు. అదే ఆ ప్రయత్నాన్ని సైనికులు అత్యంత తెలివిగా తిప్పి కొట్టారు.. తీవ్ర గాయాలైనా సరే ఉగ్రవాదులకు ఆయుధాలను ఇవ్వలేదు. ఓ సైనికుడు తీవ్రంగా గాయపడినప్పటికీ.. తాను ఉపయోగించే ఆయుధం పూర్తిగా జామ్ అయ్యేవరకు ఒక్క చేతితోనే ఫైరింగ్ చేశాడు.. కళ్ళ ముందు ఐదుగురు సహచర సైనికులు చనిపోయినప్పటికీ.. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ గాయపడిన సైనికులు ఏమాత్రం భయపడలేదు. అత్యంత ధైర్యంగా ఉగ్రవాదులను ఎదుర్కొన్నారు. ఉగ్రవాదులు ఆయుధాలు ఎత్తుకుపోకుండా తీవ్రంగా పోరాడారు. ఒకానొక సమయంలో మరింత ప్రాణ నష్టం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేశారు. అయితే దానిని సైనికులు తెలివిగా తిప్పికొట్టారు. ఉగ్రవాదులకు, సైనికులకు దాదాపు రెండు గంటలపాటు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఇక అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఉగ్రవాదుల కదలికలు, కటువా ఘటన నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం సీనియర్ అధికారులు అంతర్రాష్ట్ర భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దు ద్వారానే ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించారని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. పంజాబ్ – జమ్ము కాశ్మీర్ డీజీపీలు సమీక్షలో పాల్గొన్నారు.. కటువా ఘటనలో ఇప్పటివరకు భద్రతా దళాలు 60 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వారిని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఉగ్రదాడులకు పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. ఇక బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. ఈ ఘటన తర్వాత కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.. దీంతో వారిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. గత కొంతకాలంగా అంతర్రాష్ట్ర సరిహద్దు రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నారు.

కటువా ఘటన కు పాల్పడిన ఉగ్రవాదులను అంతమొందించేందుకు సైనికులు గాలింపును ముమ్మరం చేశారు. అనుమానితులు చెప్పిన వివరాల ఆధారంగా పలు ప్రాంతాలలో సోదాలు చేశారు. అయితే ఆ సోదాలలో ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయనే విషయాన్ని భద్రతా దళలు బయటికి చెప్పడం లేదు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు కాస్త పెరిగిన నేపథ్యంలో.. వాటిని ఎక్కడికక్కడే తొక్కి పెట్టేందుకు సైన్యం బలంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version