IIT Delhi Scientists: ఢిల్లీ ఐఐటి సరికొత్త ప్రయోగం.. ఆ తరహా క్యాన్సర్ బాధితులకు ఉపశమనం

గ్లియో బ్లాస్టోమా రకం క్యాన్సర్ కణితిని నివారించేందుకు ఢిల్లీ ఐఐటి గత కొద్దిరోజులుగా ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. "గ్లియో బ్లాస్టోమా రకానికి చెందిన క్యాన్సర్ కణితిని సమూలంగా నివారించేందుకు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించాం. వాటిపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ కూడా జరిపాం. ఇప్పటివరకు ఈ క్యాన్సర్ కేసుల్లో కణితిలు నివారించేందుకు శస్త్ర చికిత్స చేసేవారు. రేడియేషన్ ఉపయోగించేవారు. కీమోథెరపీ వంటి వైద్య విధానాల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఇవి చేసినప్పటికీ రోగులు కేవలం ఏడాది లేదా 18 నెలలకు మించి బతకడం లేదు. అలాంటివారికి ఎక్కువకాలం ఆయువు అందించేందుకు మేము సరికొత్త వైద్య విధానాన్ని తెరపైకి తీసుకొచ్చామని" ఢిల్లీ ఐఐటి పేర్కొంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 12, 2024 5:52 pm

IIT Delhi Scientists

Follow us on

IIT Delhi Scientists: జీవనశైలి మారుతోంది. ఆహారపు అలవాట్లు కూడా అదే స్థాయిలో మారుతున్నాయి. ఈ సమయంలో కొత్త కొత్త క్యాన్సర్లు వెలుగు చూస్తున్నాయి.. గతంలో గర్భాశయ ముఖద్వార, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా వెలుగు చూసేవి. అయితే కాలానుగుణంగా మెదడుకు సంబంధించిన క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అందులో గత దశాబ్దంగా “గ్లియో బ్లాస్టోమా” తరహా మెదడు క్యాన్సర్ కేసులు వైద్య శాఖకు సవాల్ విసురుతున్నాయి.. ఈ గ్లియో బ్లాస్టోమా అనేది ఒక రకమైన కణితి. ఒకసారి ఇది మెదడులో ఏర్పడితే.. ఇక అంతే సంగతులు. ఇప్పటివరకు ఈ క్యాన్సర్ నివారణలో సరైన చికిత్స పద్ధతులు లేవు. అయితే ఈ తరహా క్యాన్సర్ కేసుల్లో ఎక్కువగా మరణాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ ఐఐటి ప్రయోగాలు మొదలుపెట్టింది. అయితే ఆ ప్రయోగాలు విజయవంతం కావడంతో..గ్లియో బ్లాస్టోమా క్యాన్సర్ బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

గ్లియో బ్లాస్టోమా రకం క్యాన్సర్ కణితిని నివారించేందుకు ఢిల్లీ ఐఐటి గత కొద్దిరోజులుగా ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. “గ్లియో బ్లాస్టోమా రకానికి చెందిన క్యాన్సర్ కణితిని సమూలంగా నివారించేందుకు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించాం. వాటిపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ కూడా జరిపాం. ఇప్పటివరకు ఈ క్యాన్సర్ కేసుల్లో కణితిలు నివారించేందుకు శస్త్ర చికిత్స చేసేవారు. రేడియేషన్ ఉపయోగించేవారు. కీమోథెరపీ వంటి వైద్య విధానాల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఇవి చేసినప్పటికీ రోగులు కేవలం ఏడాది లేదా 18 నెలలకు మించి బతకడం లేదు. అలాంటివారికి ఎక్కువకాలం ఆయువు అందించేందుకు మేము సరికొత్త వైద్య విధానాన్ని తెరపైకి తీసుకొచ్చామని” ఢిల్లీ ఐఐటి పేర్కొంది.

ఢిల్లీ ఐఐటి చేసిన పరిశోధనలు బయో మెటీరియల్స్ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి . ఢిల్లీలోని బయోమెడికల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ జయంత భట్టాచార్య ఆధ్వర్యంలో పీహెచ్డీ విద్యార్థి విదిత్ గౌర్ ఈ అధ్యయనం చేశారు..గ్లియో బ్లాస్టోమా కణితి శస్త్ర చికిత్సలో ఇమ్యునోసమ్స్ పేరుతో ఒక వినూత్నమైన నానో ఫార్ములేషన్ డెవలప్ చేశారు. దీనికి అత్యంత శక్తివంతమైన యాంటీ బాడీ సీడీ 40, ఆర్ఆర్ఎక్స్ 0001 అనే అణు నిరోధకాన్ని జత చేశారు. దీనివల్ల మెదడులో ఏర్పడిన గ్లియో బ్లాస్టోమా కణితులు పూర్తిగా విలుప్తమయ్యాయి. ఎలుకలపై దీనిని ప్రయోగించగా కణితులు పూర్తిగా మాయమయ్యాయి. సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ లేకుండానే.. ఎలుకల్లో వ్యాధి నిరోధక శక్తి మరింత పెరిగింది.

ఈ ప్రయోగం పూర్తయిన తర్వాత మరో మూడు నెలల అనంతరం ఆ ఎలుకల్లోకి గ్లియో బ్లాస్టోమా కణాలను చొప్పించారు. మళ్లీ ప్రయోగాలు మొదలుపెట్టారు. అయితే ఆ ఎలుకల శరీరంలో ఎటువంటి గ్లియో బ్లాస్టోమా కణాలు డెవలప్ కాలేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గ్లియో బ్లాస్టోమా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీ చేసిన ప్రయోగం ఆ తరహా క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులకు దీర్ఘాయువును అందించనుంది. అయితే ఈ ప్రయోగం మనుషులపై ఎలాంటి ఫలితాలను ఇస్తుందనే విషయంపై ఢిల్లీ ఐఐటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే గ్లియో బ్లాస్టోమా రోగులపై త్వరలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి వచ్చిన ఫలితాలను వెల్లడిస్తామని ఢిల్లీ ఐఐటి పేర్కొంది.