https://oktelugu.com/

Miryala Sirisha Devi  : ఐదు నెలల కిందట అంగన్వాడీ టీచర్.. నేడు ఎమ్మెల్యే.. తొలి జీతం ప్రజా సేవకే!

ప్రజలకు సేవ చేయడం ప్రజాప్రతినిధి కర్తవ్యం. ప్రతిక్షణం ప్రజల కోసం తపించే గుణం ఉంటే.. వారిని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. అటువంటి ఘనత సొంతం చేసుకున్నారు ఓ యువ శాసన సభ్యురాలు.

Written By:
  • Dharma
  • , Updated On : August 5, 2024 / 11:14 AM IST
    Follow us on

    Miryala Sirisha Devi : ఆమె ఓ సామాన్య అంగన్వాడీ కార్యకర్త. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె మిరియాల శిరీషా దేవి. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె ప్రజల కష్టాలు తెలుసు. వారి ఇక్కట్లు తెలుసు. అందుకే ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారించారు. తనకు వచ్చిన తొలి జీతాన్ని ప్రజల కోసమే ఉపయోగించారు. రెండు లక్షల జీతాన్ని ఉదారంగా ప్రజల కోసం ఖర్చు చేశారు. రంపచోడవరం అంటే ముందుగా గుర్తొచ్చేది ఎమ్మెల్సీ అనంతబాబు. ఓ దళిత యువకుడి హత్య కేసులో ఆయన పేరు మార్మోగిపోయింది. రంపచోడవరం కూడా వార్తల్లో నిలిచింది. అక్కడ అనంతబాబు జరిపి అరాచకాలు అంతా ఇంతా కావని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులను వెంటాడుతారని కూడా తెలుస్తోంది. బాధిత వర్గంలో నేటి ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి కూడా ఒకరు కావడం విశేషం. శిరీషా దేవి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమె భర్త విజయభాస్కర్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు. టిడిపిలో చురుగ్గా వ్యవహరించేవారు. దీంతో విజయభాస్కర్ ను కట్టడి చేసేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు, అతని అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన వెనక్కి తగ్గకపోవడంతో భార్య ఉద్యోగాన్ని తీయిస్తామని బెదిరించారు. అనంతపని చేశారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారు. తన వల్ల అధికారులు ఇబ్బందులు పడుతుండడానికి గమనించిన శిరీషా దేవి అంగన్వాడీ కార్యకర్త పోస్టును స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు.

    * అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీ
    తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేయడం ప్రారంభించారు శిరీషా దేవి. అధినేత చంద్రబాబు దృష్టిలో పడడంతో కూటమి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పై 9139 ఓట్ల మెజారిటీతో గెలిచారు శిరీషా దేవి. 27 ఏళ్ల అతి చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబు విధ్వంసాలకు ఎదురుగా నిలిచారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకొని ఎమ్మెల్యేగా విజయం సాధించగలిగారు.

    * తొలి జీతం అలా
    అయితే ఓ సామాన్య కుటుంబం నుంచి గెలిచిన శిరీషా దేవి మరోసారి వార్తల్లో నిలిచారు. తన జీతం మొత్తాన్ని గిరిజన ఆసుపత్రుల్లో ఇన్వర్టర్లు, బ్యాటరీలు కొనడానికి వినియోగించారు. ఈ మేరకు ఆమె జీతం రాగానే కొనుగోలు చేసి ఆసుపత్రులకు పంపించారు. అయితే మిగతా ఎమ్మెల్యేలు చాలా వరకు ఇలానే చేస్తుంటారు. కానీ శిరీష దేవి అలా చేయడం మాత్రం ప్రత్యేకం. ఆమె మొన్నటి వరకు ఓ సాధారణ అంగన్వాడీ టీచర్. గెలిచిన వెంటనే తనకు తాను ఆర్థికంగా అభివృద్ధి కావాలని చూసుకుంటారు. కానీ ఆమె మాత్రం అలా చేయలేదు.

    * ఆ వేధింపులతోనే
    ప్రత్యర్థి పెట్టిన ఇబ్బందులే ఆమెను గుర్తింపు తీసుకొచ్చాయి. ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆమె పోరాట బాట పట్టారు. అలుపెరగకుండా కృషి చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో మమేకం కావడం నేర్చుకున్నారు. ఐదు నెలల కిందట వరకు ఆమె సామాన్య అంగన్వాడీ టీచర్. కానీ నేడు రంపచోడవరం ఎమ్మెల్యే. సామాన్య కుటుంబం నుంచి వచ్చినందున, ప్రజల కష్టాలు తెలుసు కనుక ప్రజల మనసును గుర్తు ఎరిగి మసులుకుంటున్నారు. పేద ఎమ్మెల్యే పెద్ద బాధ్యతలతో ముందుకు సాగుతున్నారు.