TG DSC 2024 Results : తెలంగాణలో గత ఫిబ్రవరిలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది ఆగస్టులో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 5 వేల పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్‌లో డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టులు మరో 6 వేలు పెంచి మొత్త 11,062 పోస్టులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత టెన్ నిర్వహించాలని వినతులు రావడంతో జూన్‌లో టెట్ కూడా నిర్వహించింది. అదే నెలలో ఫలితాలు కూడా విడుదల చేసింది. తర్వాత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో డీఎస్సీ వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. డీఎస్సీ ఆగస్టు 5న పూర్తవుతుందని ఆగస్టు 7న గ్రూప్–2 పరీక్ష ఉందని ఆందోళన చేశారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వాయిదా వేసేందకు నిరాకరించారు. దీంతో జూలై 18న పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 5(సోమవారం)తో పరీక్షలు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలపై విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఈమేరకు విద్యాశాఖ కూడా చకచక ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. డీఎస్సీ పరీక్షల ప్రాథమిక కీ లను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ చూస్తోంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాత తుది కీని ప్రకటించనుంది. అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టును ప్రకటించనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత నియామక పత్రాలను అందజేయనుంది.
ఆగస్టు చివరి నాటికి నియామకాలు..
డీఎస్సీ ఫలితాలను వీలైనంత త్వరగా ఇవ్వాలన్న యోజనలో విద్యాశాఖ ఉంది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. అదే రోజు హైదరాబాద్‌లో ఉద్యోగాలు సాదించిన వారికి నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలతోపాటు కొత్త టీచర్ల నియామకాలపై కూడా చర్చ జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం నాటికి నియామకాలు పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. అందుకోసమే డీఎస్పీ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. గ్రూప్స్ పరీక్షలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ డీఎస్సీ పరీక్షలను యథావిథిగా నిర్వహించింది. నిర్ణీత గడువులోగా ఫలితాలు ప్రకటించి కొత్త టీచర్లను నియమించాలని భావిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ నెలాఖారులోపే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
పోస్టులు ఇవీ..
ఇదిలా ఉంటే.. 11,062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది విద్యాశాఖ. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టుల వారీగా చూస్తేం. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్ష కేంద్రాల్లో డీఎస్పీ పరీక్షలు జరుగుతున్నాయి.
మరో డీఎస్సీ నోటిఫికేషన్..
టీచర్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. అసెంబ్లీ వేదికగా తాజాగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఇందులో 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. దీనికంటే ముందే నవంబరులో టెట్ నోటిఫికేషన్ ఇస్తామని, జనవరిలో పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే డీఎస్సీలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా 6 వేలకుపైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.