World Rarest Bird kalivi kodi
Kalivi Kodi : అంతరించిపోతున్న పక్షి జాతి అది. దానిని కాపాడేందుకు ప్రభుత్వం( government) కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ అటువంటి పిట్ట ఇప్పుడు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆ అరుదైన పక్షి జాతి శేషాచలం కొండల్లో ఉన్నట్టు ఆనవాళ్లు తెలియజేస్తున్నాయి. అప్పుడెప్పుడో 40 ఏళ్ల కిందట కడప జిల్లాలో ఈ అరుదైన పక్షి కనిపించింది. ఇప్పుడు శేషాచలం కొండలో ఉందని తెలియడంతో వెతుకులాట ప్రారంభం అయింది. ఇంతకీ ఆ అరుదైన పక్షి ఏంటంటే కలివి కోడి. శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ శాస్త్రవేత్త వీరల్ జోషి తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కలివికోడి ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు ఆరు చోట్ల లభ్యమయ్యాయని.. మరో 12 చోట్ల తిరిగిన ఆనవాళ్లు గుర్తించామని చెప్పారు. రాత్రి వేళలో మాత్రమే కనిపించే ఈ పక్షి పొదల్లో దాగి ఉంటుందని.. ఎగరలేదని చెబుతున్నారు. అందుకే వాటి పాదముద్రలు, అరుపులు ఆధారంగా గుర్తించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
* సుదీర్ఘ చరిత్ర
కలివి కోడికి సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజానికి ఇది కోడి కాదు. కానీ ప్రపంచంలో( world) అత్యంత అరుదైన పక్షి. రంగురంగు ఈకలు.. చిన్నపాటి ఆకారం… వినసొంపైన కూతలతో ఆకట్టుకునే కలివి కోడి సంక్షోభంలో పడింది. అత్యంత అరుదైన ఈ పక్షి అంతరించిపోతున్న జాతుల్లో మొదటి స్థానంలో ఉంది. అందుకే వీటిని కాపాడేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఏపీలో శేషాచలం కొండ ప్రాంతాల్లో ఈ పక్షులు ఉన్నట్లు తాజాగా అధ్యయనంలో తేలింది. కడప జిల్లాలో ఓవైపు శేషాచలం.. మరోవైపు నల్లమల అడవులు ఉంటాయి. అదే జిల్లాలోని సిద్ధవటం, బద్వేలు ప్రాంత అడవిని లంకమలగా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఓ పక్షి ‘ట్విక్ టూ ట్విక్ టూ’ అని అరుస్తుంది. ఎంత అన్వేషించినా దాని జాడ మాత్రం కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో పెరిగే కలివి పొదల్లో నివసించే ఈ పక్షిని కలిపి కోడి అని పిలుస్తారు. ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని ప్రపంచ పక్షి శాస్త్ర నిపుణులు పేల్చి చెబుతున్నారు. అయితే ఇప్పటికీ శేషాచలం అటవీ ప్రాంతం పొదల్లో ఈ జీవులు బతికే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కలివి కోడి ఆవాసం కోసం సిద్ధవటం ప్రాంతంలో ఓ మూడు వేల ఎకరాల భూమిలో 28 కోట్లతో భారీ సీసీ కెమెరాలు పరిశోధకులు ఏర్పాటు చేశారు.
* లంకమల అడవుల్లో
ఏపీలోని( Andhra Pradesh) లంకమల అడవుల్లో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఈ పక్షి కనిపించదు. ఇది వందేళ్ళ క్రితమే అంతరించిపోయిందని ప్రపంచ పక్షి శాస్త్రవేత్తలు భావించారు. కానీ లంకమల అడవుల్లో ఇంకా సంచరిస్తూనే ఉందని వార్తలు వెలుబడుతున్నాయి. కడప జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో ఆ ప్రాంతాన్ని లంక మల్లేశ్వర అభయారణ్యం పేరిట.. కలివి కోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. గత రెండేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కలివికోడి ఆచూకీ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. లంకమల అభయారణ్యంలోని వీటి ఆవాసాలను పోలిన ఆవాసాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని.. సమగ్ర సర్వే చేస్తే ఈ పక్షి జాతిని గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు భావించడంతో.. వీటి అన్వేషణ కొనసాగుతోంది.
* అన్నీ ప్రత్యేకమే
అయితే వీటి జాడ 2002 తరువాత కనిపించలేదు. ఈ పక్షుల సమగ్ర గణన సైతం జరగలేదు. రిమోట్ సెన్సింగ్( Remote Sensing) టెక్నాలజీతో వీటి ఆవాసాల్లో గత రెండు దశాబ్దాలుగా వచ్చిన మార్పులను గమనిస్తున్నారు. కలివి కోడిని 1948లో పెన్నా నది పరివాహ ప్రాంతంలో థామస్ జర్దాన్స్ కనుక్కున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పక్షి గోధుమ రంగులో.. పొడవాటి కాళ్లతో ఉంటుంది. మెడలో రెండు వెండి గొలుసులు వంటి చారలతో ఉంటుంది. ఇతర పక్షుల ఎత్తుకు ఎగర లేవు.. పగటిపూట నిద్రపోతూ.. రాత్రిపూట ఆహార సేకరణ కోసం బయటకు వస్తాయి. రెండు నుంచి పది అడుగుల ఎత్తు వరకు ఉండే కలివి పొదలు వీటి ఆవాసాలు.