Kiran Royal Case
Kiran Royal Case : జనసేన నేత కిరణ్ రాయల్( Kiran rayal ) కేసులో కీలక ట్విస్ట్. గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ వివాదానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తనను కిరణ్ రాయల్ మోసం చేశారని.. కోటి 20 లక్షల నగదు తో పాటు 25 సవర్ల బంగారాన్ని తీసుకున్నారని.. అడుగుతుంటే బెదిరింపులకు దిగుతున్నారని ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. వీధిన పడ్డ తనకు ఆత్మహత్య శరణ్యమని చెబుతూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది మొదలు రచ్చ నడుస్తోంది. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో ఆమె సోమవారం ఉదయం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
* వివిధ రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు?
అయితే ఇంతలో రాజస్థాన్( Rajasthan) పోలీసులు ఎంటర్ అయ్యారు. ప్రెస్ క్లబ్ సమీపంలో సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. రాజస్థాన్ లోని జైపూర్ లో మహిళపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల్లోనూ ఆమెపై కేసులు నమోదయాయని.. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆమె ఆరోపణలతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ కు వ్యతిరేకంగా తెగ ప్రచారం అవుతోంది. మరోవైపు బాధిత మహిళకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. కిరణ్ రాయల్ ఇంటిని చుట్టుముట్టేందుకు మహిళా సంఘాలు ప్రయత్నించాయి. అయితే ఇప్పుడు చీటింగ్ కేసులలో బాధిత మహిళను జైపూర్ పోలీసులు అరెస్టు చేశారన్న వార్తతో.. ఈ వివాదం మరో మలుపు తిరిగింది.
* తన వెనుక ఎవరి హస్తం లేదు
అంతకుముందు ప్రెస్ క్లబ్లో( Press Club) మాట్లాడిన బాధిత మహిళ తన వెనక ఎవరూ లేరని.. తాను బాధితురాలిగా మారడంతోనే బయటపడ్డానని చెప్పుకొచ్చారు. అమ్మాయిలను మోసం చేయమని కిరణ్ రాయల్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారా అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన చాలామంది మహిళల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని చెప్పుకొచ్చారు. తనకు ఎవరూ మద్దతు లేరని.. నాకు న్యాయం చేయాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ను ఆమె కోరుకున్నారు. కిరణ్ రాయల్ కు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. చంపుతానని బెదిరించడంతోనే ఇన్ని రోజులు భయపడి ఊరుకున్నానని.. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
* ప్రెస్ మీట్ తర్వాత అరెస్ట్
అయితే ప్రెస్ క్లబ్లో మాట్లాడి వచ్చిన తర్వాత ఆ బాధిత మహిళను జైపూర్ పోలీసులు( Jaipur police) అరెస్టు చేశారు. తమ వెంట తీసుకెళ్లారు. అయితే ఆమె అరెస్టు విషయంలో ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారో? ఇవ్వలేదో? అన్న విషయం మాత్రం తెలియడం లేదు. ఆ మహిళ వెనుక వైసిపి నేతల హస్తం ఉందని.. వైసిపి తనపై కుట్ర చేసిందని కిరణ్ రాయల్ చెబుతున్నారు. ఇదే విషయమై తిరుపతి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో కిరణ్ రాయల్ ఫిర్యాదు కూడా చేశారు. ఆ మహిళ వెనుక ఉన్న వైసీపీ నేతలు ఎవరు అనేది విచారణలో తేల్చాలని కోరారు. అయితే ఇంతలోనే జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం గమనార్హం.