Botsa Satyanarayana: ఏపీ రాజకీయాల్లో బొత్స కుటుంబానిది ప్రత్యేక స్థానం. పిఎసిఎస్ అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించిన బొత్స సత్యనారాయణ.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు స్థాయికి ఎదిగారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన పేరు వినిపించింది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవు. విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో మొత్తం ఆ కుటుంబం అంతా ఓడిపోయింది. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, గజపతినగరం నుంచి ఆయన సోదరుడు అప్పల నరసయ్య, నెల్లిమర్ల నుంచి సమీప బంధువు బడ్డు కొండ అప్పలనాయుడు ఓడిపోయారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా బరిలో దిగిన బొత్స అనుచరులు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇది చాలదన్నట్టు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి సైతం ఓడిపోయారు. దీంతో బొత్స కుటుంబ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ స్థానిక సంస్థలఎమ్మెల్సీ స్థానం నుంచి విజయం సాధించారు బొత్స. అయితే వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో పునరాలోచనలో పడ్డారు కుటుంబ సభ్యులను జనసేనలోకి పంపిస్తున్నారు. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ.
* బొత్స కుటుంబానిదే హవా
విజయనగరంలో బొత్స కుటుంబానిదే హవా. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక జడ్పీ చైర్మన్, ఆపై మంత్రి పదవి ఆ కుటుంబానికి ఉండేది.మిగతానియోజకవర్గ ఎమ్మెల్యేలు సైతం వారి అనుచరులే.అందుకే ఏ పార్టీ అయినా బొత్స విషయంలో భయపడేది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు మార్పులు సంభవిస్తుంటాయి. ఇది సీనియర్ నేత బొత్స కు తెలియంది కాదు. అందుకే ఇప్పుడు వైసిపి లో ఉన్న ఆయన.. ఇప్పటికిప్పుడు పార్టీని విడిచి పెట్టే ఛాన్స్ లేదు. అందుకే ముందుగా తన కుటుంబ సభ్యులను జనసేనలోకి పంపిస్తున్నారు. బొత్స సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. అక్టోబర్ 3న ముహూర్తం కూడా నిర్ణయించారు.
* మాస్ ఫాలోయింగ్
బొత్స కుటుంబానికి మాస్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఎన్నికల్లో అది పనిచేయలేదు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అంత ఈజీ కాదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా బొత్స తన సోదరుడిని జనసేనలోకి పంపుతున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ అనుమతి లేనిదే ఆ కుటుంబంలో చిన్నపాటి వ్యవహారం కూడా నడవదు. అటువంటిదిసోదరుడు జనసేనలో చేరుతున్నారంటే బొత్సకు తెలియకుండా జరగదు.కచ్చితంగా అందులో బొత్స స్కెచ్ ఉన్నట్లు విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. మొత్తానికి అయితే ముందుగానే ఒక ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు బొత్స.
* ప్రత్యామ్నయం దొరకడంతో
అయితే వైసీపీలో రకరకాల ప్రచారం మొదలైంది.వాస్తవానికి ఎన్నికలకు ముందు బొత్స జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసిపి లోనే ఉండిపోయారు. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవారు బొత్స. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లోనే కొనసాగారు. వైసీపీలో చేరలేదు. జగన్ తో పాటు వైసిపి విధానాలను వ్యతిరేకించారు. అయితే అప్పట్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీలో చేరి విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అందుకే జగన్ సైతంబొత్సకు మంత్రి పదవి ఇచ్చారు.విస్తరణలో సైతం కొనసాగించారు. అప్పట్లో ప్రత్యామ్నాయం లేకపోవడంతో వైసీపీని నమ్ముకున్నారు.అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోవడం.. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేలడంతో.. ముందు జాగ్రత్త చర్యగా సోదరుడిని జనసేనలో చేర్పించినట్లు తెలుస్తోంది. వైసీపీలో సైతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది.