TTD Laddu Issue: వైసిపి ఆత్మ రక్షణలో పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైసిపి హయాంలో వైఫల్యాలు బయటకు వస్తున్నాయి.అదే సమయంలో పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతల సంఖ్య పెరుగుతోంది. ఒక విధంగా ఇది సంక్లిష్ట పరిస్థితి.అందుకే వ్యూహకర్తలు రంగంలోకి దిగారు. వైసిపి నాయకులతో ప్రెస్ మీట్ లు పెట్టిస్తున్నారు. తాజాగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. కానీ వల్లభనేని వంశీ ఒక్క మాట అనకుండా సైలెంట్ గా ఉన్నారు. అదే సమయంలో కొడాలి నాని సైతం గతానికి భిన్నంగా మాట్లాడారు. ఎక్కడా మాటల్లో మునుపటి దూకుడు తనం ప్రదర్శించలేదు.బూతులు మాట్లాడలేదు. టీటీడీ లడ్డు వ్యవహారంలో వైసిపి తప్పు లేదని మాత్రమే చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుపై సునిశిత విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు వల్లభనేని వంశీ దిగాలుగా కనిపించారు. అయితే అది వ్యూహకర్తల పనేనని ప్రచారం సాగుతోంది.సరిగ్గా ఇదే సమయంలో శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సైతం మీడియాతో మాట్లాడారు.గతంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండేటప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన తమ్మినేని.. ఇప్పుడు వైసీపీ నేతగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడారు.అయితే వైసిపి ఆత్మ రక్షణలో పడడం వల్లే దాక్కున్న నేతలంతా బయటకు వచ్చారని ప్రచారం ప్రారంభమైంది.
* ఒక్కొక్కరు తెరపైకి
వైసిపి ఓడిపోయిన తర్వాత ఒక్కనేత అంటే..ఒక్క నేత కూడా మాట్లాడలేదు. ఇప్పుడు వారందరితో జగన్ మాట్లాడిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. టీటీడీ లడ్డు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత.. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మాత్రమే మాట్లాడారు. తర్వాత జగన్ స్పందించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఇష్టం లేని సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సింగిల్ జడ్జితో సైతం దర్యాప్తు చేయాలని కోరారు. అయినా సరే ప్రజల్లోకి వైసీపీఫై ఒక రకమైన ప్రచారం వెళ్ళిపోయింది. కోట్లాదిమంది హిందువులు అనుమానం పడేలా పరిణామాలు దారితీశా యి.
* ఆ నేతలంతా మౌనం
లడ్డు వ్యవహారంపై వైసీపీలోని తెలివైన నేతలు ఎవరూ మాట్లాడడం లేదు. గతంలో విపరీతమైన దుర్వాసనతో మాట్లాడే నేతలు ఇప్పుడు బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఆత్మరక్షణ కోసమేనని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి వైసీపీలో సైతం చాలామంది మంచి నాయకులు ఉన్నారు. వారు మాట్లాడింది తక్కువే. గతంలో తమ్మినేని సీతారాం స్పీకర్ పదవిలో ఉండేవారు. తాను ముందు ఎమ్మెల్యే అని.. తరువాత స్పీకర్ అయ్యానని.. తాను ఏమైనా మాట్లాడవచ్చని తనను తాను సమర్ధించుకునేవారు. ఇప్పుడు అదే తమ్మినేని కేవలం రాజకీయ నాయకుడే. కానీ దూకుడు తగ్గించి తిరుపతి లడ్డు వ్యవహారంపై మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* ప్రత్యామ్నాయాల వైపు చూపు
వైసిపి హార్ట్ కోర్ నాయకులంతా ఇప్పుడు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. గతంలో వివాదాస్పద మాటలతో రెచ్చిపోయిన నాయకులకు ఎటువంటి ఆప్షన్ లేదు. వేరే పార్టీలో చేరుతామంటే ఛాన్స్ దక్కడం లేదు. కనీసం వారు ఆ ఆలోచన చేయడానికి వీలు లేని స్థితిని తెచ్చుకున్నారు. ఉంటే వైసీపీలో ఉండాలి.. లేకుంటే రాజకీయాల నుంచి నిష్క్రమించాలి. అందుకే ఏ ఆప్షన్ లేకపోవడంతో.. ఇప్పుడు అధినేత చెప్పినట్టు మాట్లాడుతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికైతే తిరుపతి లడ్డు వ్యవహారం మూలన ఉన్న వైసిపి నేతలను బయటకు తీసుకు వచ్చినట్లు అయింది.