Balineni Srinivasa Reddy: జనసేనలోకి బాలినేని? నిజమెంత?

బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కు అత్యంత విధేయుడు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన వెంట నడుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : June 8, 2024 3:05 pm

Balineni Srinivasa Reddy

Follow us on

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని పార్టీ మారుతున్నారా? జనసేనలో చేరనున్నారా? అదే శ్రేయస్కరమని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా బాలినేని చేసిన ఒక ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన పార్టీ మారుతారన్న ప్రచారానికి బలం చేకూర్చుతోంది. తాజా ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. భవిష్యత్తు రాజకీయాలను తలుచుకొని ఆయన జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కు అత్యంత విధేయుడు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన వెంట నడుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచిన వెంటనే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా నే శాసించారు బాలినేని. కానీ తన సమీప బంధువు, జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తో బాలినేనికి విభేదాలు ఏర్పడ్డాయి. పతాక స్థాయికి చేరుకున్నాయి. చివరకు బాలినేనికి టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్న అనుమానం కూడా నెలకొంది. ఒంగోలు ఎంపీగా మా గుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వాలని చివరి వరకు బాలినేని ప్రయత్నించారు. కానీ జగన్ మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ బాలినేనికి మనస్థాపానికి గురిచేసాయి. దీంతో ఆయన జనసేనలో చేరతారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అక్కడ ఛాన్స్ లేకపోవడంతో వెనక్కి తగ్గారు. వైసిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు అభినందిస్తూ బాలినేని ట్విట్ చేశారు.’ అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మక ఘటనలకు తావు లేదని నిన్నటి రోజున మీరు ఇచ్చిన సందేశం హర్షణీయం. శాసనసభ్యునిగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదు. అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ కేసులు, భౌతిక దాడులు, మా అనుచరులపై వేధింపులపై మీరు స్పందించాలి’ ధన్యవాదాలు అంటూ బాలినేని చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన లేకుండా.. పవన్ కు విజ్ఞప్తి చేయడంతో.. బాలినేని జనసేనలో చేరతారన్న ప్రచారం ఎక్కువైంది. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం దిశగా బాలినేని అడుగులు వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరి బాలినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.