Bangladesh Vs Sri Lanka: నరాలు తెగే ఉత్కంఠ మధ్య.. బంగ్లా పులుల లంకా దహనం

మ్యాచ్ ప్రారంభంలోనే కుషాల్ మెండిస్ 10, కామిందు మెండిస్ 4 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. నిస్సాంక దూకుడుగా ఆడాడు.. ఫోర్లు, సిక్స్ లు కొడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 8, 2024 2:57 pm

Bangladesh Vs Sri Lanka

Follow us on

Bangladesh Vs Sri Lanka: టి20 వరల్డ్ కప్ లో భాగంగా డల్లాస్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. చివరి క్షణం వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలుపును అందుకుంది. తేమ ఎక్కువగా ఉండడంతో.. ఈ మైదానంపై స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ముఖ్యంగా బౌలర్లు పండగ చేసుకున్నారు. రెండు జట్ల బౌలర్లు 10+ వికెట్లను చేజిక్కించుకున్నారు.

ఈ మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 రన్స్ చేసింది. శ్రీలంక ఓపెనర్ నిస్సాంక 47 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.. ఈ మ్యాచ్లో శ్రీలంక ప్రారంభంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. మధ్యలో కుదురుకుంది. అయితే అదే స్పీడ్ ఇన్నింగ్స్ చివరి వరకు కొనసాగించలేకపోయింది. మైదానంపై ఉన్న తేమను వినియోగించుకుంటూ బంగ్లాదేశ్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీసి శ్రీలంకను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారు. బంగ్లా బౌలర్ల దూకుడుకు చివరి 8 ఓవర్లలో శ్రీలంక కేవలం ఒకే ఒక్క బౌండరీ సాధించడం విశేషం..

మ్యాచ్ ప్రారంభంలోనే కుషాల్ మెండిస్ 10, కామిందు మెండిస్ 4 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. నిస్సాంక దూకుడుగా ఆడాడు.. ఫోర్లు, సిక్స్ లు కొడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అతడి జోరుతో 8 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. కానీ, అతడు పెవిలియన్ చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఆట మారిపోయింది. చివరి 5 ఓవర్లలో శ్రీలంక 24 పరుగులు చేసి, ఆరు వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్, రిషద్ హుస్సేన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

శ్రీలంక విధించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లాదేశ్ చివరి వరకు చెమటోడ్చాల్సి వచ్చింది. శ్రీలంక బౌలర్ నువాన్ తుషారా (4/18) ధాటికి బంగ్లాదేశ్ 28 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాను తౌహిద్ 40, లిటన్ దాస్ 36 పరుగులు చేసి ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 63 పరుగులు జోడించారు. ఈ దశలోనే లంక బౌలర్లు విజృంభించడంతో బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మహమ్మదుల్లా 16 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. నిదానంగా ఆడుతూ లంక దహనాన్ని పరిపూర్ణం చేశాడు.