Meda Mallikarjuna Reddy: టిడిపిలోకి కడప వైసీపీ కీలక నేత.. గోడ దూకడాలు ప్రారంభం

టిడిపి కూటమి ఘన విజయం సాధించేసరికి.. మల్లికార్జున్ రెడ్డిలో ఎనలేని ఉత్సాహం వచ్చింది. దీంతో ఇప్పుడు బయటకు వచ్చారు. రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు చెబుతూపెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Written By: Dharma, Updated On : June 8, 2024 3:09 pm

Meda Mallikarjuna Reddy

Follow us on

Meda Mallikarjuna Reddy: ఏపీలో గోడ దూకడాలు ప్రారంభమయ్యాయి. అధికారాన్ని వెతుక్కుంటూ నేతలు క్యూకడుతున్నారు. తెలుగుదేశం కూటమి ఘనవిజయం సాధించడంతో వైసిపి నేతలు పక్క చూపులు చూస్తున్నారు. అధికారం కోల్పోయిన వైసీపీని వీడేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. అయితే వైసీపీలో కీలక పదవులు అనుభవించిన వారు సైతం పార్టీ మారేందుకు సిద్ధపడుతుండడం విశేషం. కడప జిల్లాకు చెందిన కీలక నాయకుడు, తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీని వీడేందుకు రెడీ అయిపోయారు. ఆయన స్వయాన వైసిపి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి సోదరుడు. ఈ ఎన్నికల్లో వివిధ కారణాలు చూపుతూ మల్లికార్జున్ రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వలేదు. అందుకు బదులుగా ఆయన సోదరుడు రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారు. రాజంపేట సీటును కడప జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. అప్పటినుంచి వైసీపీకి దూరంగా ఉన్నారు మల్లికార్జున్ రెడ్డి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు అన్న ప్రచారం ఉంది. కానీ ఎక్కడా బయట పడలేదు.

టిడిపి కూటమి ఘన విజయం సాధించేసరికి.. మల్లికార్జున్ రెడ్డిలో ఎనలేని ఉత్సాహం వచ్చింది. దీంతో ఇప్పుడు బయటకు వచ్చారు. రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు చెబుతూపెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆ కుటుంబంలో ఒకరికి రాజ్యసభ సీటు ఇచ్చినా కృతజ్ఞత చూపక పోవడాన్ని వైసిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. టిడిపి నుంచి వచ్చిన మేడా కుటుంబానికి జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తే.. వారు కనీస స్థాయిలో కృతజ్ఞత చూపకపోవడాన్ని ఎక్కువమంది తప్పుపడుతున్నారు. రాజకీయాలంటే అసహ్యం వేస్తోందని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.

మేడా మల్లికార్జున్ రెడ్డి టిడిపిలో సీనియర్. 2014 ఎన్నికల్లో కడప జిల్లాలో గెలిచిన ఏకైక టిడిపి ఎమ్మెల్యే కూడా ఆయనే. ఆ ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాల లబ్ధి పొందారు. 2019 ఎన్నికలకు ముందు మేడా మల్లికార్జున్ రెడ్డి కుటుంబం వైసీపీలో చేరిపోయింది. గత ఐదు సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించింది ఆ కుటుంబం. నియోజకవర్గంలో వెనుకబడ్డారన్న నివేదికల మేరకు మల్లికార్జున్ రెడ్డిని జగన్ తప్పించారు. అందుకు బదులు ఆయన సోదరుడికి రాజ్యసభ సీటు ఇచ్చారు. అయినా సరే మల్లికార్జున్ రెడ్డి బెట్టు వీడలేదు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ పార్టీలోనే కొనసాగే వారు. ఇప్పుడు టిడిపి కూటమిదే విజయం కావడంతో ఆ పార్టీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. వైసీపీలో ఉంటూనే రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రబాబు, పవన్ లకు మద్దతుగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన వైసీపీని వీడనున్నారు. అధికారికంగా టిడిపిలో చేరనున్నారు. అయితే మొన్నటికి మొన్న ఎన్నికలకు ముందు రాజ్యసభ సీట్లు తీసుకున్న మేడా రఘునాథ్ రెడ్డి సోదరుడిని అనుసరిస్తారా? లేకుంటే జగన్ పై విధేయత చూపి వైసీపీలో కొనసాగుతారా? అన్నది తెలియాల్సి ఉంది.