Homeఆంధ్రప్రదేశ్‌Employee Union Protests: వైసిపి పరిస్థితే కూటమికి ఎదురవుతోందా?

Employee Union Protests: వైసిపి పరిస్థితే కూటమికి ఎదురవుతోందా?

Employee Union Protests: ఏపీలో( Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతోంది. దానిని సరి చేసుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం పై ఉంది. లేకుంటే ఈ అసంతృప్తి వ్యతిరేకతకు కారణం అవుతుంది. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇదే అసంతృప్తి ఎదురైంది. ప్రజలకు అన్నీ చేస్తున్నాం కదా.. ఉద్యోగులతో ఏం పని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సర్కారు వ్యవహరించింది. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి చినికి చినికి గాలి వానలా మారి.. పెను వివాదానికి దారి తీసింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రత్యర్థిగా మార్చుకున్నారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. అలా ప్రారంభమైన అసంతృప్తి ఎన్నికల నాటికి తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. చివరకు వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యర్థిగా మార్చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోర ఓటమికి అదే కారణం అయ్యింది. ఇప్పుడు అదే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.

ఏరి కోరి తెచ్చుకున్న నేతలు..
గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని( Alliance government) ఏరి కోరి తెచ్చుకున్నారు ఉద్యోగ ఉపాధ్యాయులు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘం నాయకులు నిలిచారు. అయితే ఆదిలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచిన చాలామంది ప్రభుత్వ ఉద్యోగ నేతలు ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు, ఇతరత్రా ప్రయోజనాలు ఆశించి మౌనం పాటించారు. కానీ ఒకటి రెండు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం గట్టిగానే ఎదురు తిరిగారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత రావడంతో సంఘాల నేతలు స్పందించాల్సి వచ్చింది. దీంతో వారు తరచూ మీడియా ముందుకు వచ్చి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. అలా ఆ అసంతృప్తి కాస్త వ్యతిరేకతకు దారితీసింది. ఎన్నికల నాటికి అది మరింత ముదిరింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు పూర్తిగా వైసిపి ప్రభుత్వానికి దూరమయ్యాయి. అక్కడితో ఆగకుండా సమాజంపై కూడా వారు ప్రభావితం చూపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశారు.

Also Read: ఏపీలో కొత్తగా పలాస జిల్లా.. ఉత్తరాంధ్రకు బాబు మరో వరం?

అనేక ప్రయోజనాలు చేకూర్చిన కూటమి
అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో( employees unions ) చర్చలు జరిపిన దాఖలాలు లేవు. కానీ ఉద్యోగులకు సంబంధించి చాలా ప్రయోజనాలు చేకూర్చినట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన బకాయిలను, ఇతరత్రా రాయితీలను చెల్లించినట్లు చెప్పుకోస్తోంది. పారదర్శక బదిలీలు కూడా చేపట్టినట్లు చెబుతోంది. అయితే ఇవన్నీ వారిలో స్వాంతన చేకూర్చడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటి విషయంలో కొద్దిపాటి అసంతృప్తి ఉంది. కానీ ఎవరు బయటపడడం లేదు. అటు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సైతం మౌనంగానే ఉన్నాయి. ఉద్యోగుల వాయిస్ వినిపించడం లేదు. అయితే ఆదిలోనే గుర్తెరిగి ప్రభుత్వం నడుచుకుంటే.. వైసిపి ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురు కావు.

ఇప్పటికీ సంఘాల్లో వైసిపి వాసనలు..
అయితే తాజాగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి( AP Sachivalaya employees Union ) సంబంధించిన నేత గట్టిగానే హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సదరు నేత ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉంటుందని భావించవద్దని.. ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని హెచ్చరించారు. అచ్చం వైసిపి నేతల మాదిరిగానే ఈ హెచ్చరికలు ఉన్నాయి. ఆపై ఆయనపై వైసీపీ ముద్ర ఉంది. దీంతో ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ వాసనలో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఏ విషయమైనా ఆదిలోనే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరిస్థితి.. కూటమి ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది టిడిపి కూటమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular