Palasa New District: ఏపీలో( Andhra Pradesh) మరో కొత్త జిల్లా అవతరించనుంది. ఉత్తరాంధ్రలోని పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే శ్రీకాకుళం జిల్లాలోని ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలకు పాలనాపరమైన ఇబ్బందులు తప్పినట్టే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 193 కిలోమీటర్ల మేర సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. జాతీయ రహదారి తో పాటు రైల్వే లైన్ కూడా ఉంది. అయితే పలాస, ఇచ్చాపురం వంటి శివారు నియోజకవర్గాల ప్రజలు జిల్లా కేంద్రం శ్రీకాకుళం రావాలంటే వ్యయ ప్రయాసలకు గురికావాల్సిందే. అదే పలాస కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేస్తే పాలనాపరంగా సౌలభ్యం కలుగుతుందని అక్కడి ప్రజలు ఆశించారు. కానీ కొత్త జిల్లా కార్యరూపం దాల్చలేదు.
అప్పట్లో 26 జిల్లాలతో
2014లో రాష్ట్ర విభజన ( state divide )జరిగింది. 13 జిల్లాలకు నవ్యాంధ్రప్రదేశ్ అవతరించింది. అయితే 2022లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 26 జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే సరైన ప్రామాణికాలు, హేతుబద్ధత లేకుండా జిల్లాల విభజన జరిగిందన్న విమర్శలు వినిపించాయి. అప్పట్లో 2011 జనాభా లెక్కలను అనుసరించి జిల్లాలను విభజించారు. అయితే పలాస, మార్కాపురం వంటి ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా మార్చుతారని అప్పట్లో భావించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వాటి జోలికి వెళ్లలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కొత్తగా నాలుగు జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: వైసీపీ సీనియర్లలో ఆందోళన!
మూడు నియోజకవర్గాలతో కొత్త జిల్లా
పలాస తో( Palasa) పాటు మరో రెండు నియోజకవర్గాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. సుమారు 11,50,000 మంది జనాభా ఉన్న ఆ మూడు నియోజకవర్గాలను పలాస నియోజకవర్గ పరిధిలోకి తెస్తారని తెలుస్తోంది. 2400 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ కొత్త జిల్లా అవతరిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాగా శ్రీకాకుళం కు అపవాదు ఉంది. దానిని రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పలాస కొత్తగా జిల్లాగా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పలాస రెవెన్యూ డివిజన్ చేసింది. ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పాటుతో ఆ మూడు నియోజకవర్గాలకు పాలనా సౌలభ్యం కలగనుంది.
మూడు ప్రాంతాల కలయికతో..
పలాస, ఇచ్చాపురం( Ichapuram ) నియోజకవర్గాలు.. ఉద్దానం, మైదానం, మన్యం కలిసిన ప్రాంతాలు. అయితే కొత్తగా ఏర్పాటు కాబోయే పలాస జిల్లాలో టెక్కలి నియోజకవర్గాన్ని కలుపుతారా? లేకుంటే పాతపట్నం నియోజకవర్గాన్ని జతచేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే మిగిలిన శ్రీకాకుళం జిల్లాను కొత్తగా నాగావళి అని నామకరణం చేస్తారని ప్రచారంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఉంచి పేరు మాత్రం మార్చుతారని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే ఉత్తరాంధ్రవాసులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లు అయింది. ఒకవేళ పలాస జిల్లా కేంద్రం ఏర్పాటు అయితే మాత్రం రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం మరింత పట్టు సాధించే ఛాన్స్ కనిపిస్తోంది.