108 Services In AP: ఏపీలో అత్యవసర సేవలను అందించే 108 వాహన సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గత కొద్దిరోజులుగా నిరసన తెలుపుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది. దీంతో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు.ప్రధానంగా 15 డిమాండ్లతో ఉద్యోగుల సమ్మె బాట పట్టారు. ఒక విధంగా చెప్పాలంటే కూటమి వచ్చిన తర్వాత తొలి సమ్మె ఇదే. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొద్ది రోజుల కిందట సిబ్బంది ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు. పరిష్కారానికి సంబంధించి ఈరోజు వరకు గడువు ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చర్చలకు ఆహ్వానించలేదు. దీంతో సిబ్బంది ఈరోజు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
* జగన్ హామీ తుంగలోకి
తాను అధికారంలోకి వస్తే 108 సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తానని జగన్ హామీ ఇచ్చారు. గత ఐదేళ్లుగా ఈ హామీ అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ హామీలను అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. ఉద్యోగుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే నేరుగా తీసుకోవాలన్న డిమాండ్ తో వారు సమ్మెకు వెళ్తున్నారు. 8 గంటల పని.. మూడు షిఫ్టులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. దీంతో సమ్మె తప్పదని అంతా భావిస్తున్నారు.
* సేవలకు బ్రేక్
ప్రతిరోజు లక్షలాదిమంది ప్రజలు 108 ద్వారా అత్యవసర సేవలు పొందుతుంటారు. సమ్మెకు వెళ్లిన మరుక్షణం సేవలు నిలిచిపోతాయి. ఈ తరుణంలో సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. తాము సమ్మెకు వెళ్తే జరిగే ప్రాణ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని 108 ఉద్యోగుల సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయబద్ధమైన హామీలను, డిమాండ్లను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.