YCP: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఆ నగరంలో పార్టీ ఖాళీ.. మేయర్ తో సహా కార్పొరేటర్లు అంతా గుడ్ బై!

మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి స్వీప్ చేసింది. తాడిపత్రి మినహా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నీ వైసీపీ గెలుచుకుంది. కార్పొరేషన్లను సైతం చేజిక్కించుకుంది. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి పట్టణాలు, నగరాల్లో ఆ పార్టీకి పట్టు తప్పుతోంది.

Written By: Dharma, Updated On : August 27, 2024 9:27 am

YCP(1)

Follow us on

Shock to ycp : తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిచిందా? వైసీపీని పూర్తిగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తోందా? ముఖ్యంగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలపై దృష్టి పెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి మినహా..మొత్తం అన్ని కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది వైసిపి. దాదాపు స్వీప్ చేసినంత పని చేసింది. అప్పట్లో వైసిపి హవా చూసి చంద్రబాబు ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించారు. అప్పట్లో వైసీపీ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించిందని.. బలవంతంగా గెలుచుకుందని ఆరోపిస్తూ.. స్థానిక ఎన్నికలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. టిడిపి కూటమి ఘనవిజయం సాధించింది. 175 స్థానాలకు గాను 164 చోట్ల గెలుపొందింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించిన వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 25 ఎంపీ స్థానాలకు గాను నాలుగు చోట్ల మాత్రమే గెలుపొందింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసిపి కంచుకోటలు సైతం బద్దలయ్యాయి. దీంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే పార్టీని చాలామంది నేతలు విడిచి వెళ్లిపోతున్నారు. కేశినేని నాని, రావెల కిషోర్ బాబు, అలీ, ఆళ్ల నాని, కిలారు రోశయ్య, మద్దాలి గిరి, శిద్దా రాఘవరావు వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకా చాలామంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు.

* టిడిపి వైపు అందరి చూపు
ప్రధానంగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు టిడిపి ఖాతాలో చేరుతున్నాయి. వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టిడిపి వైపుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు చేరిపోయారు. విశాఖలో దాదాపు వైసీపీ ఖాళీ అయింది. అటు నెల్లూరు, చిత్తూరు కార్పొరేషన్లు సైతం టిడిపి చేజిక్కించుకునే అవకాశం ఉంది. వైసిపి కీలక నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టిడిపికి చిక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘ ఎన్నికల్లో టిడిపి కూటమి విజయం సాధించింది.

* టిడిపిలోకి ఏలూరు మేయర్
తాజాగా ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేశారు. రేపు ఆమె తన భర్త పెదబాబుతో కలిసి టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో చేరనున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు ఏలూరు కార్పొరేషన్ లో కార్పొరేటర్లంతా టిడిపి బాట పట్టనున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ టిడిపికి చిక్కనుంది.

* అన్ని మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి
ఇప్పటికే చాలా మున్సిపాలిటీలు టిడిపి వశమయ్యాయి. పుంగనూరు, హిందూపురం, మాచర్ల.. ఇలా ప్రధాన మున్సిపాలిటీలు ఖాళీ అయ్యాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు పెరిగాయి.ప్రతి మున్సిపాలిటీలో వైసిపి కౌన్సిలర్లు టిడిపి వైపు చూస్తున్నారు.నాడు ఎన్నికల్లో టిడిపి కేవలం తాడిపత్రి నియోజకవర్గం లో మాత్రమే విజయం సాధించింది. కానీ ఇప్పుడు వైసీపీ ఖాతాలో ఉన్న మున్సిపాలిటీలు.. టిడిపి ఖాతాలో పడుతుండడం విశేషం.