Vallabhaneni Vamsi: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Vallabha neni Vamsi Mohan )ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆయనకు రిమాండ్ల మీద రిమాండ్లు కొనసాగుతున్నాయి. గత కొద్ది నెలలుగా ఆయన జైలు జీవితం అనుభవిస్తూనే ఉన్నారు. ప్రధానంగా గన్నవరం టిడిపి కార్యాలయం పై జరిగిన దాడి కేసుకు సంబంధించి ఇప్పటికీ ఆయనకు బెయిల్ లభించడం లేదు. ఈ కేసుకు సంబంధించి నేటితో రిమాండ్ ముగిసింది. దీంతో ఆయనను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. మే 7 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో వల్లభనేని వంశీ మోహన్ ఇప్పట్లో కేసుల నుంచి బయటపడే అవకాశం లేదని స్పష్టం అవుతుంది.
Also Read: చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. తెరపైకి మందకృష్ణ మాదిగ!
* వైసిపి హయాంలో దూకుడు..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయేవారు వల్లభనేని వంశీ మోహన్. తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) ద్వారా రాజకీయ ప్రవేశం చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో తొలిసారిగా గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే 2019లో రెండోసారి గెలిచారు కానీ టిడిపి అధికారంలోకి రాలేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అప్పటినుంచి చంద్రబాబుతో పాటు లోకేష్ పై టార్గెట్ చేసేవారు. నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అయితే దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ మోహన్ కు ఓటమి తప్పలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వంశీ. కానీ అనూహ్యంగా ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నెలల తరబడి రిమాండ్ల మీద రిమాండ్లు కొనసాగుతున్నాయి.
* ఆ రెండు కేసుల్లో సూత్రధారి..
ప్రధానంగా గన్నవరం( Gannavaram) తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో సూత్రధారిగా వల్లభనేని వంశీ మోహన్ పై అభియోగాలు మోపారు పోలీసులు. స్థానిక ఎమ్మెల్యేగా ఉండి అనుచరులను, వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆయన పై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో 72వ నిందితుడిగా వంశీ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. అంతేకాకుండా టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీ రిమాండ్ ఖైదీ. అయితే నిన్ననే ఇదే కోర్టులో సత్య వర్ధన్ కు సంబంధించిన కేసులో హాజరు పరచగా 14 రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు తాజాగా గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో.. రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరు పరిచారు. ఇప్పుడు కూడా రిమాండ్ కొనసాగించింది న్యాయస్థానం.
* బెయిల్ కోసం న్యాయపోరాటం
వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. కానీ న్యాయస్థానాల నుంచి చుక్కెదురు అవుతోంది. కింది కోర్టుల్లో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అవుతుండడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పై స్థాయిలో బెయిల్ పొందేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రిమాండ్ కు సంబంధించి కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడటంతో వెంటనే తిరిగి వంశీని విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. మరోవైపు ఓ భూమి కబ్జా కేసుకు సంబంధించి హైకోర్టులో వంశీ మోహన్ బెయిల్ పిటిషన్ వేశారు. అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురయింది. దీంతో ఇప్పట్లో వల్లభనేని వంశీ మోహన్ బయటపడే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.