MLC Duvvada Srinivasa Rao : లైవ్ లో బోరున ఏడ్చిన దువ్వాడ.. ఊకో అంటూ ఓదార్చిన మాధురి.. వైరల్ వీడియో!

కుమార్తెలను తలుచుకొని దువ్వాడ శ్రీనివాస్ ఏడ్చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పిల్లల ప్రస్తావన వచ్చేసరికి ఆయన తెగ బాధ పడిపోయారు. వారికోసం అన్నీ చేశానని.. కానీ తండ్రి అంటేనే వారు మండిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Written By: Dharma, Updated On : October 10, 2024 11:51 am

MLC Duvvada Srinivasarao

Follow us on

MLC Duvvada Srinivasa Rao : తెలుగు నాట దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్ ఎంతో వినోదాన్ని పంచింది. కుటుంబ విషయాన్ని రగడ చేసుకుని మీడియాలో హైలెట్ గా నిలిచింది దువ్వాడ ఫ్యామిలీ. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురి సైతం మధ్యమధ్యలో ఎంట్రీ ఇచ్చి మరింత రక్తి కట్టించారు. చివరకు ఇంటి వివాదంలో మాధురి మాట చెల్లుబాటు అయ్యింది. ఎన్నికలకు ముందు ఆమె వద్ద రెండు కోట్ల రూపాయల అప్పు తీసుకున్నానని.. అప్పునకు బదులు ఇంటిని రాసిచ్చానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితేఅప్పటినుంచి దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి మాధురి అదే ఇంట్లో ఉంటున్నారు. సరికొత్తగా ఆ జంట హల్చల్ చేస్తోంది. ఇంటి ఆవరణలో ద్విచక్ర వాహనంపై జంటగా తిరుగుతూ చేసిన రీల్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. రెండు రోజుల కిందట తిరుమలలో ఆ జంట ప్రత్యక్షమైంది. లీగల్ వివాదాలు తేలిన వెంటనే వివాహం చేసుకుంటామని చెప్పుకొచ్చారు వారిద్దరు. పనిలో పనిగా మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.

* ముందుగా ఆందోళన చేసింది కుమార్తెలే
దువ్వాడ శ్రీనివాస్ కు భార్య వాణి తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలను డాక్టర్లుగా చదివించారు దువ్వాడ. పెద్ద కుమార్తెకు వివాహం కూడా చేశారు. అయితే వాణి తో ఉన్న విభేదాలతో.. దువ్వాడ శ్రీనివాస్ మాధురితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడాన్ని కుమార్తెలు తప్పుపట్టారు. తొలుత ఇద్దరు కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి రభస ప్రారంభం అయ్యింది. తమ తండ్రి వేరే మహిళతో ఉంటున్నారని పిల్లలిద్దరూ స్వయంగా మీడియాకు వెల్లడించారు. తమ తండ్రి తమ పట్ల అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. ఒకానొక దశలో దువ్వాడ శ్రీనివాస్ వారిపై దుర్భాషలు ఆడిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాస్ విమర్శలు ఎదుర్కొన్నారు.

* సర్వం ఇచ్చేశా
అయితే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి తో కలిసి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో కుమార్తెల ప్రస్తావనవచ్చేసరికి బోరున విలపించారు.నా ఇద్దరు పిల్లలను గుండెల మీద పెట్టుకుని పెంచాను. కానీ నన్ను నాన్న అని పిలవడానికి వారికి మనసు రావడం లేదు. నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో? నాకున్న ఆస్తులన్నీ వారికి రాసిచ్చా. వారికి నేను ఏం చేయాలి? అని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటి పర్యంతమవుతున్న దువ్వాడ శ్రీనివాసును మాధురి ఓదార్చారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎనిమిది సార్లు పోటీ చేశారు. కానీ ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. అయినా సరే జగన్ పిలిచి మరి దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చారు. అయినా సరే దువ్వాడ శ్రీనివాస్ గెలవలేకపోయారు. అయితే భార్య వాణి కుటుంబంతో రాజకీయాల్లోకి దువ్వాడ వచ్చారని ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఆ కుటుంబానికి తాను అండగా నిలబడినట్లు చెప్పుకొస్తున్నారు. తాను సంపాదించిన మొత్తం కుమార్తెలకు ఇచ్చేశానని చెబుతున్నారు. అయినా సరే తన విషయంలో కుమార్తెలు అలా వ్యవహరించడాన్ని గుర్తుచేసుకొని బాధపడుతున్నారు.