Deputy CM Pavan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మరోసారి తన ఔదార్యాన్ని చూపించారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.తన మాటను నిలబట్టుకోవడం కోసం సొంత నిధులు 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారి పల్లెలో పాఠశాలకు క్రీడా మైదానం కోసం స్థలం కొనిస్తానని హామీ ఇచ్చారు.ఆ హామీ మేరకు 60 లక్షల సొంత డబ్బుతో ఎకరా స్థలం కొని..మైసూర్ వారి పల్లె పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామసభలు జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మైసూరు వారి పల్లెలో జరిగిన గ్రామసభలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలం లేకపోవడాన్ని గుర్తించారు.సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇస్తానని హామీ ఇచ్చారు.ఇప్పుడు దీనికోసం 60 లక్షల సొంత నిధులతో ఎకరా స్థలం కొనుగోలు చేసి అందించారు.అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్,రాజంపేట సబ్ కలెక్టర్ నిధియా దేవి సమక్షంలో..ఆ గ్రామ సర్పంచ్ సంయుక్త కు అందజేశారు డాక్యుమెంట్స్.క్రీడా మైదానానికి అవసరమైన విధంగా తీర్చిదిద్దాలని అధికారులకు పవన్ ఆదేశించారు.
* తల్లిదండ్రుల విన్నపం మేరకు
ఆ గ్రామంలో జరిగిన గ్రామసభలో పవన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు సరైన ఆటస్థలం లేదని పవన్ దృష్టికి తీసుకొచ్చారు.దీంతో దసరాలోగా అక్కడ ఆట స్థలం ఏర్పాటు చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు తన సొంత ట్రస్టు నిధుల నుంచి 60 లక్షలు ఖర్చుచేసి ఆట స్థలం కొనుగోలు చేశారు. ఇది చిన్న ప్రయత్నమేనని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
* సొంతంగా ట్రస్ట్
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే ఎన్జీవో గా.. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ పేరిట ఓ ట్రస్టు ఏర్పాటు చేశారు. ప్రధానంగా చదువుకునే విద్యార్థులకు సాయం చేయడం, విద్య వైద్యం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఈ సమస్త ముఖ్య ఉద్దేశం.ప్రస్తుతం పవన్ మంత్రిగా ఉండడంతో.. వీలైనంతవరకు ప్రభుత్వ పరంగా సాయం చేయాలని భావిస్తున్నారు. సాధ్యం కాని పరిస్థితుల్లో తన సొంత ట్రస్ట్ నుంచి నిధులు సమకూరుస్తున్నారు. పవన్ సొంత నిధులతో పాఠశాల క్రీడామైదానాన్ని ఏర్పాటు చేయడంపై జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.